National

స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీ..

టమాటా ధరలు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్నాయి. టమాటా ధరలు చూసిన సామాన్యులు హడలెత్తిపోతున్నారు. దేశంలో టమాటా గరిష్ఠంగా రూ. 250 పలుకుతుండగా.. కనిష్ఠంగా రూ.100 గా ఉంది.

హైదరాబాద్ లో కిలో టమాటా రూ.90 నుంచి రూ130 వరకు పలుకుతోంది.

బెంగళూరులో కిలో టమాటా రూ.101 నుంచి రూ.130 పలుకుతుండగా.. కోల్ కత్తాలో రూ.150, ఢిల్లీలో రూ.120, ముంబైలో రూ.120 గా ఉంది. టమాటా ధరలు భారీగా పెరగడంతో రెస్టారెంట్ లు టమాటా వినియోగాన్ని తగ్గిస్తున్నాయి.

ఆహార దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ తమ మెనూ నుండి టమోటాలను తొలగించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. టమాటా ధరలు పెరుగడానికి దిగుబడి తగ్గడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ ధరల మోత మరో 2 నెలల పాటు ఉండే అవకాశం ఉంది.

అప్పటి వరకు వంటల్లో టమాటా వినియోగం తగ్గిస్తేనే మంచిదని సామాన్యులు అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం టమాటాలో ఖరీదుగా మారడంతో ఓ మొబైల్ షాప్ నిర్వహకుడు వినూత్న ఆలోచన చేశాడు. స్మార్ట్ ఫోన్ కొంటే రూ.2 కిలో టమాటాలు ఉచితంగా ఇస్తున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ మొబైల్ షోరూమ్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్‌లకు 2 కిలోల టమాటాలను బహుమతిగా అందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే 2 కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తున్నట్లు మొబైల్ దుకాణదారుడు అభిషేక్ అగర్వాల్ చెప్పారు.

ఈ పథకం ప్రారంభించిన వెంటనే కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని, దీని కారణంగా, మేము ఎక్కువ మొబైల్‌లను విక్రయిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో, టమాటాలు ఉచితంగా అందించడంతో కస్టమర్లు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో టమాటా దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా టమాటా పై మీమ్స్ నడుస్తున్నాయి. ఇక్కడ విషయమేమింటే.. ఒక్క టమాటా ధరలే కాదు పచ్చి మిర్చి ధరలు కూడా భారీగానే ఉంది. కిలో పచ్చి మిర్చి రూ.100 నుంచి రూ.120 పలుకుతుంది. మిగతా కూరగాయల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. విరివిగా ఉపయోగించే ఉల్లిపాయ రేట్లు కూడా పెరిగాయి. అటు చికెన్, గుడ్ల ధర కూడా బాగానే ఉంది.