ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాద కేసు విచారణ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కేసులో జూలై 7న సీబీఐ అరెస్టు చేసిన రైల్వే సిబ్బంది సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ రిమాండ్ గడువు ముగిసింది.
దీంతో వారిని శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. ఆ ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. జూలై 27న తదుపరి విచారణ జరిగే వరకు వారిని జ్యుడీషియల్ కస్టడీలో(Odisha Train Accident Case) ఉంచాలని తెలిపింది.
ముగ్గురు నిందితులపై IPC 304 సెక్షన్ (అపరాధపూరితమైన నరహత్య), IPC 201 సెక్షన్ (సాక్ష్యాలను నాశనం చేయడం), రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసులను నమోదు చేశారు. అరుణ్ కుమార్ మహంత, మహ్మద్ అమీర్ ఖాన్, పప్పు కుమార్ లను జూలై 7 నుంచి 15 వరకు తమ రిమాండ్ లో ఉంచుకొని సీబీఐ ఇంటరాగేట్ చేసింది. ఈ కేసుపై సీబీఐ ఇంకా తన నివేదికను సమర్పించనప్పటికీ.. ట్రైన్ సిగ్నలింగ్ సర్క్యూట్ ను మార్చే క్రమంలో జరిగిన లోపాల వల్లే ప్రమాదం జరిగిందని సౌత్ ఈస్టర్న్ సర్కిల్‌లోని రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) విచారణలో తేలింది. బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 293 మంది మరణించగా, 1,200 మందికి పైగా గాయపడ్డారు.