National

కాంగ్రెస్ అభ్యర్థిని కూడా తానే నిర్ణయిస్తానంటూ మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే మంత్రి మల్లారెడ్డి.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. సమావేశాల అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.

మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరుండాలో తానే నిర్ణయిస్తానంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్ తానే ఇప్పించినట్లు చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో తనకు స్నేహితులు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు డబుల్ బెడ్రూం ఇళ్ల అంశం తప్ప మాట్లాడేందుకు మరొకటి లేదని మల్లారెడ్డి మండిపడ్డారు.

మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజలు తాను చేసిన అభివృద్ధిని మరిచిపోయి.. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలు వింటున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉంటే తన పదవి ఊడుతుందని కొందరు ప్రచారం చేశారన్నారు. కొంతమంది తనపై కక్షపూరితంగా తప్పుడు చేస్తున్నారని మండిపడ్డారు మల్లారెడ్డి.

త్వరలో తాను మీడియా సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అంతేగాక, తెలంగాణ యాసకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు కూడా నిర్మించబోతున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. తనపై జరిగిన ఐటీ దాడులపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి.

కాగా, గురువారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకున్న చర్యలపై చర్చిస్తామని తెలిపింది. అయితే, 20 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది. కాగా, ఈ సమావేశాల్లో సుమారు 10 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు, బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులను పిలవకపోవడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు.