భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మరో రెండు రోజుల్లో చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ఇప్పటికే ల్యాండర్ యొక్క కక్ష్యను విజయవంతంగా తగ్గించడం జరిగింది.
ప్రస్తుతం చంద్రయాన్-3 చంద్రుడికి అత్యంత సమీపంలో పయనిస్తోంది. ఇదిలా ఉంటే చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ బుధవారం(23వ తేదీ) సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ కానుంది.
ల్యాండింగ్ టైం ఫిక్స్..
అయితే ఎక్కడ ల్యాండ్ కావాలి, ఎలాంటి ప్రదేశమైతే ల్యాండింగ్‌కు అనుకూలం అనే అంశాలపై ఇస్రో పరిశోధన చేసింది. దానికి సంబంధించిన ఫొటోలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. చంద్రుడి నుంచి కాస్త దూరంలో ఈ ఫొటోలను తీయడం జరిగింది. ఈ ఫోటోలను హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా ద్వారా తీసుకోబడ్డాయి. ల్యాండర్ విక్రమ్ ల్యాండ్ అయ్యేందుకు అనువైన ప్రదేశాలను ఈ కెమెరాలు బంధిస్తాయి. రాళ్లు లేదా లోతైన కందకాలు లేకుండా సురక్షితమైన ప్రాంతంలో ల్యాండర్ ల్యాండ్ చేయడంలో ఈ కెమరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఇస్రో ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసింది.
చందమామకు సమీపంలో..
ఇదిలా ఉంటే చంద్రయాన్-3 ప్రస్తుతం చంద్రుడికి అత్యంత సమీప కక్ష్యలో సంచరిస్తోంది. విక్రమ్ ల్యాండర్ సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చంద్రుడి దగ్గరకు చేరుకుంది. ఈ సమయంలో చంద్రుడికి ల్యాండర్‌కు మధ్య దూరం 25 కిలోమీటర్లుగా ఉంది. ల్యాండర్ ల్యాండింగ్ ప్రక్రియ ఆగస్టు 23 సాయంత్రం 6:04 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇస్రో వెల్లడించింది.
దీర్ఘవృత్తాకార కక్ష్యలో..
ల్యాండర్ చంద్రుని చుట్టూ దీర్ఘావృత్తాకార కక్ష్యలో కదులుతోంది. గతంలో ఇది 113 కి.మీ/157 కి.మీ కక్ష్యలో ఉండేది. ఇదిలా ఉంటూ బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి మరో డీబూస్టింగ్ ఆపరేషన్ జరిగింది. ఈ రెండవ డీబూస్టింగ్ ఆపరేషన్ తర్వాత, ల్యాండర్ చంద్రుని యొక్క 113 కిమీ/157 కిమీ కక్ష్య నుండి మరో 25 కిమీ/134 కిమీ చంద్రుడి కక్ష్యకు తరలించబడింది. అంటే చంద్రుడి సమీపంకు ల్యాండర్ చేరుకుంది. ఈ కక్ష్యలో ఉన్న సమయంలోనే ల్యాండర్ సాఫ్ట్ ల్యాండిగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
ఉపరితలం పరిశీలన..
ల్యాండర్ ల్యాండింగ్‌కు ముందు చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలించి, చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రణాళికబద్ధమైన ల్యాండింగ్ సైట్‌లో ల్యాండ్ అవుతుంది. ఈ ప్రక్రియ కోసం ల్యాండర్ చంద్రునిపై సూర్యకాంతి కోసం వేచి చూడాల్సి వస్తుంది. రష్యా లాండర్ క్రాష్ అయిన నేపథ్యంలో విక్రమ్ సేఫ్ ల్యాండింగ్‌పై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.