National

ఇండియన్స్ గో బ్యాక్.. రష్యా ఫ్రెండ్ గో బ్యాక్

ఆవులు ఆవులు పొడుచుకొని.. దూడల కాళ్ళు విరగొట్టాయన్న తీరుగా ఉంది రష్యా, ఉక్రెయిన్ వ్యవహారం. కొంతకాలంగా ఒక దేశం మీద మరొక దేశం కాల్పులు, ప్రాణ, ఆస్తి నష్టాలకు పాల్పడుతున్నాయి.

ఈ యుద్ధం వల్ల ప్రపంచంలో అనేక రకాలైన కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సరే ఆ దేశాల తీరు అలాగే ఉంటుంది కాబట్టి వాటిని అలాగే వదిలేద్దాం. కానీ ఆ యుద్ధం ప్రభావం మన దేశం మీద ఎక్కువగా ఉంది. పేరుకు రష్యా నుంచి చౌక ధరకు ఇంధనం వస్తోంది అన్నమాటే గాని.. ఆ దిగుమతుల వల్ల భారతదేశం కొన్ని దేశాలకు శత్రువుగా మారింది. అంతేకాదు తనతో రష్యా యుద్ధం చేస్తోంది కాబట్టి, రష్యాకు ఇండియా ఫ్రెండ్ కాబట్టి.. తమ దేశంలో చదువుతున్న ఇండియన్స్ బయటకు వెళ్లిపోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఇండియన్ విద్యార్థులు లక్ష్యంగా రకరకాల దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఈ సమయంలో ఉక్రెయిన్ దేశంలో వైద్య విద్య చదువుతున్న భారత విద్యార్థులకు సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు(గతంలోని కేంద్రం వారికి స్పష్టమైన హామీలు ఇచ్చింది) ఉండకుండా ఎవరి దారి వారు చూసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. దేశం కాని దేశంలో తాము ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఆవేదన కలిగిస్తోంది.

ఇండియన్స్‌ గో బ్యాక్‌

”ఇండియన్స్‌ గో బ్యాక్‌..!”.. ”రష్యా ఫ్రెండ్స్‌ గో బ్యాక్‌..!”..
ఇవీ ఇప్పుడు యుద్ధ కల్లోల ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న నిరసనలు. గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభమయ్యాక.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, అష్టకష్టాలు పడుతూ.. వేర్వేరు దేశాల మీదుగా భారత్‌ చేరిన ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఇప్పుడు తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని వాపోతున్నారు. తమ వైద్య విద్యను పూర్తిచేసేందుకు గత నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లిన వారు.. అడుగడుగునా సహాయ నిరాకరణను ఎదుర్కొంటున్నారు. రష్యాపై ఉక్రెయిన్‌ ఎదురుదాడి ప్రారంభించాక ఉక్రెయిన్‌ పౌరుల్లో ఈ జాఢ్యం మరింత పెరిగిందని భారత విద్యార్థులు వాపోతున్నారు.
రష్యాకు వ్యతిరేకంగా గత ఏడాది ఐక్య రాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన పలు తీర్మానాల విషయంలో భారత్‌ తటస్థంగా ఉన్న విషయం తెలిసిందే. దానికి తోడు.. యుద్ధం ఆరంభమైన తర్వాత అంతర్జాతీయంగా రష్యాను ఒంటరిని చేసే ప్రయత్నాల్లో పాశ్చాత్య దేశాలు, అగ్రరాజ్యాలు బిజీగా ఉంటే.. భారత్‌ మాత్రం ఆ దేశం నుంచి ముందెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున చమురును కొనుగోలు చేస్తోంది. ఆయుధాల దిగుమతికి ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో.. భారతదేశం తమ శత్రుదేశమైన రష్యాకు మిత్రదేశం అని ఉక్రెయిన్‌ పౌరులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఆ కోపాన్ని ఇప్పుడు భారతీయ విద్యార్థులపై ప్రదర్శిస్తున్నారు. భారతీయ విద్యార్థులు కనిపిస్తే.. ”యూ ఇండియన్స్‌.. గో బ్యాక్‌..” అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. అంతేకాదు. భారతీయ విద్యార్థులు ఉండే హాస్టళ్లకు విద్యుత్తు, నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. హాస్టల్‌ క్యాంటీన్లలో సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ”విద్యుత్తు కోతలతో సతమతమవుతున్నాం. ఇంత చేసినా.. సంతృప్తిగా చదువుకునే పరిస్థితులు లేవు. నిద్రలో ఉండగా.. హాస్టల్‌ పైనుంచి హెలికాప్టర్ల శబ్దాలు.. యుద్ధ సైరన్లు.. దూరంగా క్షిపణుల శబ్దాలు..! క్షణక్షణం భయంభయంగా ఉంటోంది. నిద్ర ఉండడం లేదు. చదువు సాగడం

పచారీ సామాను కూడా ఇవ్వడం లేదు

ఇక పచారీ కొట్లలో సరుకులు కొనేందుకు వెళ్తే.. ఆ దుకాణాల యజమానులు ”భారత్‌-రష్యా మిత్రదేశాలు. అందుకే భారతీయులకు సరుకులు ఇవ్వం” అంటూ తెగేసి చెబుతున్నారు.
3,400 మంది విద్యార్థులు
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభమైనప్పటికి అక్కడ 18 వేల మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేవారు. భారత ప్రభుత్వం వారందరినీ విడతల వారీగా ‘ఆపరేషన్‌ గంగ’లో భాగంగా భారత్‌కు రప్పించింది. మరికొందరు భారతీయ విద్యార్థులు ప్రాణభయంతో సరిహద్దు దేశాలకు వెళ్లి.. అక్కడ నుంచి అష్టకష్టాలు పడుతూ నాలుగైదు నెలల తర్వాత భారత్‌కు చేరారు. అప్పట్లో ఉక్రెయిన్‌లో చదువుకునే భారతీయ విద్యార్థులకు మన దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీని రాష్ట్రాలు, వర్సిటీలు బుట్టదాఖలు చేయడంతో తమ విద్యను కొనసాగించేందుకు ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని మన దేశ విద్యార్థులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ నుంచి ‘ఆపరేషన్‌ గంగ’లో భాగంగా భారత్‌ తిరిగి వచ్చిన విద్యార్థుల్లో చాలా మంది తిరిగి వెనక్కి వెళ్లలేదు. వారిలో జూనియర్లు ఇక్కడి వర్సిటీల్లో మళ్లీ మొదటి నుంచి ఎంబీబీఎస్‌ చదవడమో.. తమ కలలను చంపుకోవడమో చేస్తున్నారు. 18 వేల మంది విద్యార్థులు భారత్‌కు తిరిగి వస్తే.. గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు 3,400 మంది విద్యార్థులు మాత్రమే వైద్యవిద్యను కొనసాగించేందుకు తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లారు. వీరంతా ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న వారే.. 2021లో భారత వైద్య మండలి(ఎంసీఐ) సవరించిన నిబంధనలతో.. విదేశాల్లో ఒకే వర్సిటీలో వైద్య విద్యను పూర్తిచేయాలి. యూనివర్సిటీ మారడానికి వీల్లేదు. ఈ కారణంతో ఫైనలియర్‌ విద్యార్థులు చాలా వరకు ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లారు. ఇప్పుడు అక్కడ ఉక్రెయిన్‌ పౌరులు సహాయ నిరాకరణకు దిగుతూ.. భారతీయ విద్యార్థులపై కారాలు, మిరియాలు నూరుతుండడంతో తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు.