CINEMANational

సెప్టెంబరు మాసం. సినిమాల కోసం!

ఆగస్టులో టాలీవుడ్ కి గట్టి ఎదురు దెబ్బే తగలింది. వరుస వైఫల్యాలతో బాక్సాఫీసు అల్లాడిపోయింది. డబ్బింగ్ బొమ్మ జైలర్ ఒక్కటే కాస్త నిలబడగలిగింది. మిగిలినవన్నీ భారీ ఫ్లాపులే.

అయితే సెప్టెంబరు విషయంలో టాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకొంది. ఈ నెలలో సినిమాలే సినిమాలు. అన్నింటిపై అంచనాలు ఉన్నాయి. మినిమం గ్యారెంటీ చిత్రాలు ఇప్పుడు వరుస కడుతున్నాయ్‌.

సెప్టెంబరు 1న ‘ఖుషి’ విడుదల అవుతోంది. విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. పాటలు బాగున్నాయి. ట్రైలర్ ఓకే అనిపించుకొంది. పాజిటీవ్ బజ్ మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతోంది. వెండి తెరపైకి ఓ లవ్ స్టోరీ వచ్చి చాలాకాలమైంది. ఏమాత్రం ఎక్కినా.. యూత్ ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. అయితే ఒకే ఒక్క మైనస్ పాయింట్ భయపెడుతోంది. విజయ్‌, సమంత, శివ నిర్వాణ.. వీళ్ల గత చిత్రాలు ఫ్లాపులుగా మిగిలిపోయాయి. ఈ ముగ్గురికీ ఈ సినిమా విజయం చాలా కీలకం.

సెప్టెంబరు 7న ‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ వస్తున్నారు. అనుష్క, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. నవీన్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తన సినిమా అంటే యూత్ లో సెపరేట్ క్రేజ్ ఉంది. అది ఏమాత్రం కలిసి వచ్చినా.. వసూళ్లు బాగుంటాయి. అయితే ఈ సినిమా ప్రచారం చాలా డల్ గా సాగుతోంది. పబ్లిసిటీలో అనుష్క కనిపించకపోవడం పెద్ద లోటు.

సెప్టెంబరు 15న రామ్ – బోయపాటి ‘స్కంద’ వస్తుంది. ఇదో మాస్‌, కమర్షియల్ మీటర్ లో సాగే సినిమా. టీజర్‌,ట్రైలర్ లలో అదే కనిపించింది. బోయపాటి గత సినిమాలకూ, ఈ సినిమాకీ ఎలాంటి మార్పూ ఉండకపోయినా, మాస్‌కి బాగా ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా లక్కీ గాళ్ శ్రీలీల ఉండనే ఉంది. విడుదలకు ముందే బిజినెస్ పరంగా ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది.

ఇక ఈ నెలలో విడుదల అవుతున్న సినిమాల్లో అందరి దృష్టీ ‘సలార్‌’పై ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. ఈ సినిమాపై బజ్ మామూలుగా లేదు. ఓవర్సీస్ లో బుకింగులు కూడా ఓపెన్ అయ్యాయి. అక్కడ రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడైపోయాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా, తొలి మూడు రోజుల్లో కనీవినీ ఎరుగని వసూళ్లు రావడం ఖాయం. ఏమాత్రం బాగున్నా – మరో వెయ్యి కోట్ల సినిమా అవుతుంది.

వీటితో పాటు.. షారుఖ్ ఖాన్ ‘జవాన్‌’ సినిమా కూడా సెప్టెంబరు 7న విడుదల అవుతుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ సినిమా అయినా, సౌత్ ఫ్లేవర్ సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నయనతార, విజయ్‌సేతుపతి లాంటి స్టార్లు ఉండడం, అట్లీ దర్శకుడు కావడం, అనిరుథ్ సంగీతం అందించడం ఇవన్నీ ఈ సినిమాపై సౌత్ లుక్ తీసుకొచ్చాయి. షారుఖ్ గత చిత్రం ‘పఠాన్‌’ తెలుగులో మంచి వసూళ్లే అందుకొంది. ఈసారి జవాన్ ఆ రికార్డ్ బ్రేక్ చేయొచ్చు.