National

కాంగ్రెస్ టార్గెట్ అంతసులువు కాదు..

వ్యూహాలు రచించినా.. ఒక్కోసారి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు సహకరించాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితులు సహకరిస్తున్నాయా? రాష్ట్రాల్లో లెక్కలు ఏం చెబుతున్నాయి? ఒక వైపు మోడీ 400 సీట్లు టార్గెట్ అంటుంటే.. దాన్ని తగ్గించడంలో కాంగ్రెస్‌కు సహకరించే అంశాలు ఏమున్నాయి?

 

ఇటీవలి CVoter ఒపీనియన్ పోల్‌తో పాటు ఇతర విశ్వసనీయ డేటా విశ్లేషణ ప్రకారం, 2024 పోరాటంలో ప్రతిపక్షాలు ఏటవాలుగా ఉన్న పర్వతాన్ని ఎక్కాల్సి ఉంటుందన్నది స్పష్టం. అయితే, బీజేపీ గెలవాలని అనుకుంటున్న 400 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థులు ఎలాంటి వ్యూహాలు చేపట్టాలనే అంశం గురించి రాజకీయ విశ్లేషకులు చర్చలు చేస్తున్నారు. అలాగే, 50% కంటే ఎక్కువ మంది ఓటర్లు బిజెపికి ఓటు వేయకుండా ఉండటానికి, కాంగ్రెస్ పార్టీ కొంత వరకూ హిందుత్వవాదాన్ని న్యూట్రలైజ్ చేయాల్సి ఉందని చెబుతున్నారు. దీనితో పాటు, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా భాగస్వామ్య పక్షాలు ప్రధాని మోడీని పూర్తిగా విస్మరించి, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలనీ కొందరు సూచిస్తున్నారు.

 

ఇప్పటికే తమదైన పంథాలో పనితీరు కనబరుస్తున్న బీజేపీ ఎంపీల ఏకపక్ష భావనలను తూర్పారబట్టాలని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, దీనికి మద్దతునిస్తూ.. డిఎంకె నాయకులు మరొక కొత్త వ్యూహాన్ని అందిస్తున్నారు. బీజేపీ హిందూ మతాన్ని దుర్వినియోగం చేస్తోందనీ… ఉత్తర భారతీయులను మతత్వవాదులుగా చాలా క్రూరంగా చూపిస్తోందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ల గలిగితే, వారు ప్రతిపక్ష కూటమికి ఓటు వేయడానికి ప్రయత్నించవచ్చని కొత్త మార్గాన్ని సూచిస్తున్నారు. అయితే, క్షేత్ర స్థాయిలో ఈ వ్యూహాల అమలులో సున్నితత్వాన్ని పాటించాలి. దీని కోసం ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి పదజాలాన్ని, ప్రయోగాలను, ఉదాహరణలన వాడుతుంది అనేది చూడాల్సి ఉంది.

 

అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి ఉన్న ప్రజాదరణను బట్టి ప్రతిపక్ష కూటమి అనుకున్నది సాధించడానికి ఒకే ఒక మార్గం అందుబాటులో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదో ఒకవిధంగా బిజెపిని 260 కంటే తక్కువ సీట్లకు లేదా 250 కంటే తక్కువ సీట్లకు తగ్గించడమే ఇప్పుడు వారి ముందున్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి కంటే నరేంద్ర మోడీ భిన్నమైన వ్యక్తి. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా పనిచేసిన 23 ఏళ్లలో మోడీ తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మాట వాస్తవం.

 

దూకుడుగా, అనాలోచితంగా కాకుండా ఈ విగ్రహాన్ని ఎదురించడానికి తెలివిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. దీని కోసం న్యూట్రల్ ఓటర్లతో పాటు హిందూవాద ఓట్లను కూడా ఆకర్షించగలగాలి. భారత జాతియత అనేది మతానికంటే ఎక్కువగా దేశానికి సంబంధించినదనే భావనను భారీగా తీసుకురావాల్సి ఉంది. దీని కోసం, బ్లేమ్ గేమ్ ఆడే కంటే… బెటర్ గేమ్ ప్లాన్ చేయాలని రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీకి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని కోసం కాంగ్రెస్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో అనేది మరో కొన్ని రోజుల్లో అర్థమవుతుంది. అయితే, అంతకుమించిన సవాళ్లు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి పరీక్షగా ఉంది.

 

లోక్‌సభలో మెజారిటీ కోసం బీజేపీ పార్టీ దాని “మిత్రపక్షాల”పై ఆధారపడవలసి వస్తే, అది నరేంద్ర మోడీ ఇకపై అత్యున్నత నాయకుడు కాలేరనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అలాకాక, బీజేపీకి 250 సీట్లు దాటితే, కాంగ్రెస్ 100 దాటలేకపోతే… బీజేసీ కూల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. కానీ మిగిలిన 25 సీట్లను తీసుకొచ్చే బీజేపీ మిత్రపక్షాలు చాలా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దాని కంటే ఎక్కువగా… ఈ సంకీర్ణ ప్రభుత్వానికి అధిపతిగా మోడీ ప్రాభల్యం భారతదేశంలో తగ్గడం మొదలవుతుంది.

 

గతంలో భారతీయులు ఇందిరా గాంధీని సంకీర్ణ నేతగా ఊహించలేక పోయారు. ఇకపోతే, నిస్సందేహంగా 2014, 2019 లోక్‌సభ విజయాల తర్వాత కూడా ఎన్‌డిఎలో భాగంగా బీజేపీకి తోడుగా ఉన్న అనేక మిత్రపక్షాలు దూరమయ్యాయి. అయితే, వారిని వెనక్కి రప్పించేందుకు బీజేపీ అగ్రనేతలు ఎలాంటి గట్టి ప్రయత్నాలు చేసినట్లు ఎప్పుడూ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ గతంలో తెచ్చుకున్న సీట్ల కంటే తగ్గితే జరిగేది ఇదే అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే, కాంగ్రెస్ వ్యూహంలో 275 సీట్లు కీలకంగా మారాయి. దీని కోసం ఇండియా కూటమి నుండి బలమైన పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సగం మెట్లు దిగడానికి సిద్దపడిందన్నది స్పష్టమవుతోంది.

 

2019లో గెలిచిన 303 సీట్లతో బీజేపీ సౌకర్యవంతంగానే ఉంది. 2024లో ఆ సంఖ్యను పెంచుకోవడంపై ఇప్పుడు దృష్టి సారించింది. అయితే, ఇక్కడ విపక్షాల దృష్టి సరిగ్గా వ్యతిరేకంగా కనిపిస్తోంది. బీజేపీని మెజారిటీ మార్కు కంటే చాలా దిగువకు తీసుకెళ్లగలగడం ఇప్పుడు వారి ముందు ఉన్న అతిపెద్ద సవాలు. దీని కోసం, మోడీ ప్రభావాన్ని తగ్గించడానికి, బీజేపీని తారుమారు చేయడానికి 2019 లెక్కల నుండి కనీసం 40 నుండి 50 సీట్ల మధ్య ఆ పార్టీని ఓడిపోయేలా చేయాలి. దీనికి ఊతమిస్తూ, ఇటీవల వచ్చిన ABP-CVoter ఒపీనియన్ పోల్ ఉంది. దీని ప్రకారం, బీజేపీ సొంతంగా పోటీ చేస్తుంటే సాధారణంగా దాని మెజారిటీ తగ్గుతుందని అంచనా వేయబడింది.

 

ఈ దశాబ్ధ కాలంలో… బిజెపి అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా తన ఓట్ల షేరును మెరుగుపరుచుకున్నప్పటికీ, అది ఆ స్థానాల్లో గెలవలేదని పోల్ సూచిస్తుంది. ఇక, వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ వంటి కొందరు ప్రాంతీయ నాయకులు వారి సొంత కోటల్లో ప్రజాదరణ పొందిన నాయకులుగా ఉన్నారు. ఆ మేరకు, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో బిజెపి గణనీయమైన సంఖ్యలో సీట్లను పొందడం సాధ్యం కాదు. ఇక, దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. తెలంగాణలో ఘోరమైన ఓటమిని చవిచూసిన బీజేపీ అక్కడి నుండి సీట్లు ఆశించలేదు. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో అవకాశం రాదు. ఇకపోతే, మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏంటీ…?

 

2023 నాటి సంఘటనల ఆధారంగా… పశ్చిమ బెంగాల్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర అనే నాలుగు రాష్ట్రాలలో బిజెపి చాలా బలహీనంగా ఉందని తెలుస్తూనే ఉంది. 2019లో 28 స్థానాలకు గాను 25 స్థానాలను గెలుచుకుని, 2024లో కూడా అదే పని చేస్తుందని అంచనా వేసిన కర్ణాటకతో ప్రారంభిస్తే…. బీజేపీ గెలుపు సంఖ్య 25 నుండి 18 స్థానాలకు పడిపోయింది. అంటే 7 సీట్ల నష్టం. ఇక, పశ్చిమ బెంగాల్‌‌లో చూస్తే… 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి మద్దతుదారులు చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కున్నారు. చాలా మంది భయంతో ఓటు వేయడానికి కూడా వెళ్ళకపోవచ్చని క్షేత్ర స్థాయి నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి, అక్కడ బిజెపి సంఖ్య 2019లో 18 నుండి 2024 నాటికి 10కి పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీకి 18 సీట్లు తగ్గాయి.

 

ఇటువైపు, మహారాష్ట్రను తీసుకుంటే…. ఇక్కడ బీజేపీలో చాలా “విభజనలు”, చాలా భిన్నమైన పొత్తులు ఉన్నాయి. దీని కారణంగా అక్కడ పార్టీ పరిస్థితి గందరగోళంలో ఉంది. కాగా, మహారాష్ట్రలో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని సీవోటర్ పోల్ సూచిస్తోంది. అయితే, ఈ రాష్ట్రంలో 2019లో సాధించిన 23 సీట్ల నుంచి 2024లో 16కి బీజేపీ పడిపోతుందని అనుకుంటే… రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకంగా 25 స్థానాలు తగ్గుతాయి. 2019లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగా… ఇప్పుడు అందులో 25 స్థానాలు తగ్గితే, ఈ ఎన్నికల్లో బీజేపీ 278 సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. మరోవైపు, బీహార్‌లో వామపక్షాలు, కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూలు బలీయమైన కూటమిని కలిగి ఉన్నాయి. 2019లో ఇక్కడ బీజేపీ 17 సీట్లు గెలుచుకుంది. ఇక, 2024లో బీజేపీ సంఖ్య 12కి పడిపోతుందని అనుకుంటే… ఇప్పుడు బీజేపీ ఏకంగా 30 సీట్లను కోల్పోయింది. దీన్ని బట్టి బీజేపీకి గతంలో వచ్చిన 303కు 30 తగ్గితే, 273 వరకూ సర్థుకోవాల్సి ఉంటుంది.

 

అయితే, బీజేపీ ఛాన్స్ ఇంకా సజీవంగానే ఉంది. ఇప్పటికీ 273 స్థానాల్లో మెజారిటీ సాధిస్తోంది. ఏది ఏమైనా కర్నాటక, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీకి ఇన్ని సీట్లు పడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కొందర నిపుణులు భావిస్తున్నారు. కానీ హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో పార్టీ వాస్తవంగా అన్నింటినీ కైవసం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే, వాస్తవం ఏమిటంటే, ఇప్పటికీ ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష ముఖాముఖి పోటీ అలాగే ఉంది.

 

ఈ ప్రాంతాల్లో మరో పార్టీకి ఎటువంటి ఆశ లేదు. కనీసం 2024కి కూడా వస్తుందనే నమ్మకం లేదు. కాబట్టి, కాంగ్రెస్ మద్దతుదారుల అభిప్రాయం ప్రకారం… 80 మంది ఎంపీలను పంపే ఉత్తరప్రదేశ్‌‌లో మాయావతి-అఖిలేష్ యాదవ్ కూటమిని ప్రభావం తక్కువని అనుకోలేము. 2019లో ఇక్కడ బీజేపీ 62 సీట్లు గెలుచుకున్నారు. అయితే, 2024లో దానికంటే ఎక్కువ గెలుస్తారని కచ్ఛితంగా చెప్పలేము. ఇలా, ప్రతి రాష్ట్రంలో ఈసారి పెను మార్పులు సాధ్యమవుతాయనే నమ్మకంతో కాంగ్రెస్ వ్యూహాలు నడుస్తున్నాయి. దీనితో, 2024 ఎన్నికలు 2004ను పునరావృతం చేస్తాయా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

 

ఇంతకీ, 2004లో ఏం జరిగింది? బీజేపీ, ఎన్‌డిఎ ఫ్లాప్ షోకి మూలకారణం రెండు తప్పిదాలుగా కనిపించింది. మొదటిది డీఎంకేను మిత్రపక్షంగా కోల్పోయి, ఆ తర్వాత టీడీపీ ఒత్తిడికి తలొగ్గి ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వడం. రెండు… రాష్ట్రాల్లో, దాదాపు 80 సీట్లతో, ఎన్డీఏ తుడిచిపెట్టుకుపోయింది. దీనితో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కంటే 31 సీట్లు ఎక్కువ తెచ్చుకుంది. పశ్చిమ బెంగాల్‌లో మరో ఎన్డీఏ మిత్రపక్షం టీఎంసి 42 సీట్లలో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించింది. కాగా, 2004ని 2014, 2019 ఎన్నికలతో పోల్చి చూస్తే, ఈ మూడు రాష్ట్రాలు లేకుండా బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించేది.

 

2019లో పశ్చిమ బెంగాల్‌లో 18 సీట్లు గెలవడం విశేషం. వాజ్‌పేయి హయాంలో ఎన్డీయే మిత్రపక్షాలు పరాజయం పాలైనప్పుడు బీజేపీ పరాజయం పాలైంది. అయితే, ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, మోడీ హయాంలో బీజేపీ నిస్సందేహంగా మరో స్థాయికి చేరుకుంది. 2014ను దాటి 2019 ఎన్నికలు దాన్ని స్పష్టం చేశాయి. అయితే, 2024లో మార్పు మోత మోగుతుందా అనేది వేచి చూడాలి. రాహుల్ గాంధీ జోడో యాత్రలతో వచ్చి ఇండియా ఊపుకు, ఇప్పుడు రాబోయే న్యాయ యాత్ర ఎంత ఆజ్యం పోస్తుందో చూడాలి. పాపులారిటీకే ప్రధాన ప్రాధాన్యతనిస్తూ కొనసాగుతున్న అధికార పక్షం క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కుంటుందో గమనించాలి. మొత్తానికి, హస్తం పార్టీ వ్యూహం ఫలించి, ప్రాంతీయ పార్టీలు కూడా సహకరిస్తే… 2004 పునరావృతం కాకపోదనే అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.