National

అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడితే రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది.

అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు. దీన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తరువాతే.. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా పడొచ్చా? లేక షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయా? అనేది తేలుతుంది. అప్పటివరకు తెలంగాణలో ఎవరి రాజకీయ కార్యకలాపాల్లో వారు మునిగిపోయారు.

యధాతథంగా షెడ్యూల్ ప్రకారమే ఈ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితే తలెత్తితే మాత్రం అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. డిసెంబర్‌లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. దీనికోసం అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి.

ఈ పరిణామాల మధ్య అధికార భారత్ రాష్ట్ర సమితి తన రూటును మార్చింది. కర్ణాటక కాంగ్రెస్ నేతలకు విమర్శల గురి పెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దిశానిర్దేశం చేస్తోన్నారనే ఆరోపణలకు తెర తీసింది.

తాజాగా- బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్.. ఆ పార్టీ విమర్శల తీవ్రతను తెలియజేస్తోంది. ఏఐసీసీ అధిష్ఠానంతో దీనికి ముడిపెట్టారామె. ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ మాత్రమే దిక్కుగా ఉండేదని, ఇప్పుడు ఢిల్లీ- ఇప్పుడు వయా బెంగళూరుగా మారిందని ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలో ఆత్మగౌరవం అనే పదాన్నీ ప్రయోగించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం, ఢిల్లీ గల్లీల్లో మోకరిల్లడం.. అంటూ నిప్పులు చెరిగారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి.. డీకే శివకుమార్‌తో సమావేశమైన ఓ ఫొటోను కవిత తన ట్వీట్‌కు జత చేశారు.