National

మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి

మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరికొందరు వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నార్కోటిక్ పోలీసుల అదుపులో కీలక వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం. అంతేకాదు ఈ డ్రగ్స్ కేసులో బేబీ సినిమా పేరు కూడా తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది

కొద్దిరోజుల క్రితం మాదాపూర్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దనుండి 50 గ్రాముల ఎండిఎంఏ, 8 గ్రాముల కొకైన్, 24 ఎస్టసి పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 18 మందిలో ఐదుగురు డ్రగ్స్ వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసిన నైజీరియన్ లను సైతం అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో విచారణ ముమ్మరం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఈరోజు హైదరాబాద్ సిటీ సీపీ సివి ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బేబీ సినిమా ప్రస్తావన తీసుకువచ్చి బేబీ టీంకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. బేబీ సినిమాపై సీరియస్ అయ్యారు.

మాదాపూర్ అపార్ట్మెంట్లో లభ్యమైన డ్రగ్స్ కేసులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబీ సినిమా పేరు తెరమీదకు వచ్చింది. ఈ సినిమాలో డ్రగ్స్ ఏ విధంగా వాడాలో ఒక సీను ఉంటుందని, సేమ్ అలానే మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొందరు వినియోగదారులు, సినిమాలో సీన్ ను చూసి డ్రగ్స్ తీసుకున్నారని హైదరాబాద్ సి పి సి వి ఆనంద్ వెల్లడించారు.

బేబీ చిత్ర యూనిట్ కు నోటీసులు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ ను ప్రోత్సహించే విధంగా సినిమాలు తీయవద్దని నటీనటులకు, దర్శకులకు, నిర్మాతలకు సిపి సివి ఆనంద్ సూచించారు.అంతేకాదు ఇకనుంచి ప్రతి సినిమా పైన నిఘా పెడతామని హైదరాబాద్ సి పి సీవి ఆనంద్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారంలో కస్టమర్ గా ఉన్న హీరో నవదీప్ పరారీలో ఉన్నాడని ఆయన వెల్లడించారు. మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.