APNational

చైనా ఆటకట్టు: కటిక చీకట్లో కదలికలను పసిగట్టేలా..!!

న్యూఢిల్లీ: లఢక్ (Ladhak) సమీపంలో గల వాస్తవాధీన రేఖ సహా సరిహద్దు వెంబడి తరచూ ఉద్రిక్తతలకు పాల్పడుతూ భారత్‌ (India)ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చైనా (China) ఆటను కట్టించడానికి సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది ఆర్మీ.

దీనికోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారాన్ని తీసుకుంటోంది.

లఢక్ మొదలుకుని సిక్కిం (Sikkim), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) వరకూ తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తోంది చైనా. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోంది. అటు జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) సరిహద్దుల్లో పాకిస్తాన్ (Pakistan) వైపు నుంచి కూడా ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడుతున్నారు.

మరోవంక- పశ్చిమ బెంగాల్ (West Bengal) సరిహద్దుల్లోనూ ఇదే తరహా వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ (Bangladesh), మయన్మార్ (Myanmar) నుంచి పెద్ద ఎత్తున అసాంఘిక శక్తులు అక్రమంగా సరిహద్దులను దాటుకుని పశ్చిమ బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అడుగు పెడుతున్నాయి. చొరబాటుదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆర్మీ కీలక ముందడుగు వేసింది.

కటిక చీకట్లో సైతం చొరబాటుదారులు, ఉగ్రవాదుల కదలికలను పసిగట్ట కలిగే అత్యాధునికమైన డ్రోన్ల (Drones)ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వాటిని బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ నైట్ విజన్ డ్రోన్ల (Night vision drones)ను వాడుకలోకి తీసుకొచ్చింది. సరిహద్దు భద్రత దళం (BSF) నార్త్ బెంగాల్ ఫ్రాంటియర్ (North Bengal Frontier) ఆరో బెటాలియన్ ట్రూప్ దీన్ని అభివృద్ధి చేసింది.

ఈ డ్రోన్లను బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విజయవంతంగా వినియోగించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. నైట్ విజన్‌లో శతృవుల కదలికలను విజయవంతంగా పసిగట్టినట్లు తెలిపింది. ఈ నైట్ విజన్ డ్రోన్లను లఢక్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో మోహరింపజేసే అవకాశాలను పరిశీలిస్తోన్నామని పేర్కొంది.