National

మొన్న ‘మోత మోగింది’.. రేపు దీపాలుండవ్..!!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మొన్న మోత మోగించగా, రేపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శనివారం రాత్రి 7.00 గంటలకు ఇళ్లల్లో లైట్లు ఆర్పి ఇంటి బయట సెల్ టార్చ్ లేదంటే కొవ్వొత్తుల వెలిగించి ఐదు నిముషాలపాటు నిరసన తెలియజేయాలని సూచించారు. ఈమేరకు పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు.

రోడ్డుపై ఉన్నవారు కార్లలో, బైకులవి హెడ్ లైట్లు ఆన్ ఆఫ్ చేస్తూ నిరసన తెలపాలని సూచించారు. ‘మోత మోగిద్దాం’ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్లుగానే గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా భారత కాలమానం ప్రకారం నిరసనలో పాల్గొనాలన్నారు. బాబుతో నేను అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు. ఇంటి ప్రధాన ద్వారాలు, బాల్కనీలో, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు, టార్చ్ లైట్లు.. వీటిలో వేటినైనా తీసుకుని వెలుగు చూపించాలన్నారు.

‘అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలు. చంద్రబాబు గారి అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటిని సూచిస్తోంది. ఆ చీకటిని తరిమికొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి. ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలను వెలిగిద్దాం’ అంటూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.

‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి… దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి? .. రేపు అందరూ లైట్లు బ్లింక్ చేయాలంటూ పిలుపునిచ్చారు నారా బ్రాహ్మణి.