స్టాక్‌హోమ్: ప్రఖ్యాత శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, సాహితీవేత్తలు, రచయితలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి.
వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రంగంలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతుల ప్రకటన చేస్తూ వస్తోన్నారు జ్యూరీ కమిటీ సభ్యులు.
ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటనల పరంపర సోమవారం ప్రారంభమైంది. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యంలో నోబెల్ బహుమతి కోసం ఎంపికైన శాస్త్రవేత్తల పేర్లను వెల్లడించారు.
మెడిసిన్‌లో అద్భుతాలను ఆవిష్కరించిన హంగేరియన్- అమెరికన్ బయో కెమిస్ట్ కటాలిన్ కరికో, అమెరికన్ ఫిజీషియన్ సైంటిస్ట్ డ్రూ వీస్‌మన్‌లకు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి వరించింది. ఫిజిక్స్‌లో పియర్రీ అగొస్టిని, ఫెరెంక్ క్రాస్జ్, అన్నె ఎల్ హ్యులియర్‌కు జాయింట్‌గా నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు.
సాహిత్యంలో నోబెల్ ప్రైజ్.. నార్వేకు చెందిన ప్రఖ్యాత నాటక రచయిత జోన్ ఒలావ్ ఫోస్సేకు లభించింది. నాటకాలు, గద్య నాటకాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ సాహిత్యంలో నోబెల్ బహుమతి 2023 కోసం జోన్ ఫొస్సే పేరును ప్రకటించారు. సమాజాన్ని ఉత్తేజ పరిచే ఎన్నో నాటకాలు, నాటికలు, గద్య, పద్య సాహిత్యాలు, నవలలను జోన్ ఫొస్సే రచించారు.
ఇక తాజాగా- ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి 2023 (Nobel Peace Prize 2023) విజేత పేరును ప్రకటించింది జ్యూరీ. ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల ఉద్యమ కార్యకర్త నర్గెస్ మహ్మదీ (Narges Mohammadi) పేరును ఎంపిక చేశారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని నర్గెస్ మహ్మదీకి అందజేయనున్నట్లు నోబెల్ కమిటీ సెక్రెటరీ జనరల్ రీస్- అండర్‌సెన్ తెలిపారు.
నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపికైన 19వ మహిళ నర్గెస్ మహ్మది. నోబెల్ శాంతి బహుమతి పొందిన రెండో ఇరానియన్ మహిళ కూడా. 2003లో షిరిన్ ఇబాది అనే ఇరానియన్ మహిళకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. బుర్ఖా సరిగ్గా ధరించలేదనే కారణంతో 21 సంవత్సరాల మహసా అమినిని కొట్టిచంపిన కేసులో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు నర్గెస్. ఫలితంగా జైలుపాలయ్యారు.
ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఎవిన్ కారాగారంలో శిక్షను అనుభవిస్తోన్నారు. వివిధ కేసుల్లో 12 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తోన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడినందుకు ఇరాన్ ప్రభుత్వం 13 సార్లు అరెస్ట్ చేసింది. నర్గెస్ వయస్సు 51 సంవత్సరాలు కాగా.. ఇప్పటివరకు 31 సంవత్సరాల పాటు ఆమె కారాగారంలో గడిపారు. 154 కొరడా దెబ్బలను భరించారు.
మానవ హక్కులపై పోరాటం సాగించడానికి ప్రత్యేకంగా ఏర్పాటైన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తోన్నారు. ఇక ముందు కూడా నర్గెస్ పోరాటం కొనసాగుతుందని ఆమె భర్త తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.