National

3న బీజేపీ జెండా ఎగరాలి: మోడీ అలా.. కేసీఆర్ ఇలా అంటూ అమిత్ షా

ఆదిలాబాద్: డిసెంబర్ 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలని.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. కుమురంభీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించిన అమిత్ షా.. పవిత్ర భూమి ఆదిలాబాద్ రావడం సంతోషంగా ఉందన్నారు.

మోడీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడతుందన్నారు అమిత్ షా. కేసీఆర్ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. గిరిజన వర్సిటీకి కేసీఆర్ సర్కారు స్థలం చూపించలేదని.. అందుకే ఆలస్యమైందని చెప్పారు. మోడీ.. కృష్ణా ట్రైబ్యునల్ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారన్నారు. పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదన్నారు.

రైతులు, దళితులు, గిరిజనులను కేసీఆర్ పట్టించుకోలేదని అమిత్ షా మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని అమిత్ తెలిపారు. ప్రతి పేద మహిళకు మోడీ వంటగ్యాస్ ఇచ్చారని.. రైతుల ఖాతాల్లో ఏటా రూ. 6వేలు జమ చేస్తున్నారని చెప్పారు. ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను మోడీ.. రాష్ట్రపతిని చేశారని అమిత్ షా తెలిపారు.

అయోధ్యలో రామమందిరం కట్టాలా? వద్దా? చెప్పండి? అడ్డంకులను అధిగమించి మోడీ సర్కారు రామమందిరం నిర్మిస్తోంది. ఆర్టికల్ 370 ఎత్తివేసి కాశ్మీర్‌కు విముక్తి కల్పించిందన్నారు అమిత్ షా. సర్జికల్ స్ట్రైక్స్ చేసి శత్రువులను తరిమికొట్టిందన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశానని కేసీఆర్ చెబుతుంటారు.. రైతులు ఆత్మహత్యల విషయంలో, అవినీతి విషయంలో తెలంగాణను నెంబర్ చేశారని అమిత్ షా విమర్శించారు.