National

అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండి: రాహుల్ గాంధీ పర్యటనపై కవిత సెటైర్లు

హైదరాబాద్: తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్రజలంతా బాగానే ఉన్నారని..

ఇప్పుడున్న మంచి వాతావరణాన్ని మళ్లీ చెడగొట్టవద్దని కాంగ్రెస్​ నేతలకు కవిత సూచించారు. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కవిత ఆయన పర్యటనపై విమర్శలు గుప్పించారు.

విభజన చట్టంలోని తెలంగాణకు రావాల్సిన వాటాల గురించి రాహుల్​ ఎప్పుడైనా ప్రశ్నించారా? అని కవిత నిలదీశారు. అందుకే రాహుల్​ జీ మీరు ఇక్కడికి వచ్చి చేసేదేం లేదు.. అంకాపూర్​ చికెన్​ తినేసి వెళ్లండని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కవిత. నిజామాబాద్‌​లోని బోధన్​ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ నేతలతో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్​ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని కవిత తెలిపారు. కాంగ్రెస్​ అగ్రనేతలు వచ్చి తమకు ఏమీ చెప్పనక్కరలేదని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి బీఆర్​ఎస్​ ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. రాహుల్​ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. వేల మంది బీసీ యువకులు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం.. సీఎం కేసీఆర్​ కల్పించారని కవిత పేర్కొన్నారు.

రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రైతులపై రాజకీయం చేయడం కాంగ్రెస్​ నేతల నైజమని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ పరిపాలనలో హైదరాబాద్‌​కు వందల కంపెనీలు వచ్చాయని గుర్తు చేశారు. గత చరిత్రను చూసుకుంటే ఏ రాష్ట్రంలో అయినా సీఎంను మార్చాలని చూపినప్పుడల్లా మత కల్లోలాలు రేపింది ఎవరని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రశ్నించారు. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంతగా అభివృద్ధి జరిగిందా? అని రాహుల్​ గాంధీని కవిత నిలదీశారు. రాహుల్ ఇక్కడ చేసేదేం లేదని.. అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లాలని చురకలంటించారు.