National

అయోధ్యా రాముడికి వెంకన్న చిరు కానుక..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ప్రభుత్వం.

 

ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యాంత్రంగం దీనిపై రోజూ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది.

 

ఈ నెల 15వ తేదీ నాడే రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఆరంభమౌతాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవంగా దీన్ని నిర్వహించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలనూ పంపించింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి.

 

రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకొనే రామ్ లల్లా విగ్రహాల నిర్మాణం సైతం పూర్తయింది. శ్రీ ఆంజనేయ, లక్ష్మణ సమేత సీతారామచంద్రులవారి విగ్రహాలు అవి. మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ వాటిని నిర్మించారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాలను రామమందిరంలో ప్రతిష్ఠించాలని తీర్థక్షేత్ర ట్రస్ట్..నిర్ణయించింది.

 

ఈ కార్యక్రమానికి లక్ష లడ్డూలను పంపించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు ఇటీవలే ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుమల శ్రీవారి తరఫున అయోధ్య రామమందిరానికి లక్ష లడ్డూలను పంపిస్తామని తెలిపింది. రామమందిరం ప్రారంభోత్సవానికి హాజరయ్యే ప్రతినిధులతో పాటు అయోధ్య వాసులకు ఈ లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేస్తారు.

 

ఈ నేపథ్యంలో- లడ్డూ ప్రసాదాలను టీటీడీ అధికారులు తయారు చేయిస్తోన్నారు. ప్రధానమంత్రి సహా దేశం నలుమూలల నుంచి వచ్చే వీఐపీలు, ఇతర ప్రతినిధులకు ఈ లడ్డూలను అందించాల్సి ఉంటుంది. ఎప్పట్లాగే నాణ్యమైన వస్తువులను దీనికోసం వినియోగిస్తోన్నారు. శుద్ధమైన నెయ్యి, జీడిపప్పు.. ఇతర వస్తువులతో శరవేగంగా లడ్డూల తయారీ సాగుతోంది.