National

2036 ఒలింపిక్స్ భారత్‌లోనే..!

ఒలింపిక్స్‌ క్రీడలు 2036 సంవత్సరంలో ఇండియాలో జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2023 డిసెంబరు చివరివారంలో తన గుజరాత్ పర్యటన సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకోగలిగితే.. అవి అహ్మదాబాద్‌లోనే ఉండొచ్చనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఒక దేశం.. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలంటే ఏ అర్హతలను కలిగి ఉండాలి? ఆతిథ్య దేశం విషయంలో ఒలింపిక్స్ కమిటీ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది? వంటి అంశాలను పరిశీలిద్దాం.

 

2024, 2028, 2032 ఒలింపిక్స్ క్రీడలు పారిస్, లాస్ ఏంజెల్స్, బ్రిస్బేన్‌లో జరగటం ఖాయమైన వేళ.. ఆ తర్వాతి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని మనదేశం భావిస్తోంది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించిన అనుభవంతో.. ప్రపంచపు ఐదవ ఆర్థిక శక్తిగా, ప్రపంచపు అతిపెద్ద జనాభా ప్రతినిధిగా ఈ క్రీడోత్సవాన్ని తన భవిష్యత్ ఆర్థిక వ్యూహాలకు వేదికగా మలచుకోవాలని భారత్ ఆరాటపడుతోంది. ఇప్పటికే ఆ దిశగా చర్చలూ కొనసాగిస్తోంది.

 

ఒకవేళ భారత్‌లో ఈ క్రీడలు జరిగితే.. వాటికి గుజరాత్‌లోని నరేంద్రమోదీ అంతర్జాతీయ స్టేడియం వేదికయ్యే అవకాశం చాలా ఎక్కువ. మౌలిక సదుపాయాల పరంగా ఉన్నత ప్రమాణాలను కలిగి ఉండటంతో బాటు స్వరాష్ట్రం వైపు మోదీ మొగ్గు చూపే అవకాశమే ఇందుకు కారణం. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీ తన మేనిఫెస్టోలో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు గుజరాత్ వేదిక అయ్యేలా ప్రయత్నిస్తామని కూడా ప్రకటించింది.

 

ఇప్పటికే భారత ప్రభుత్వం.. గత సెప్టెంబర్‌లో ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ భేటీలో భారత్ తన ప్రతిపాదనలను ఉంచింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకు ఈ క్రీడలను నిర్వహించగల సత్తాను తాము 2036 నాటికి సమకూర్చుకోగలమని ఈ భేటీలో భారత్ భరోసా ఇచ్చింది.

 

ఏ దేశంలోనైనా ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలంటే.. గతంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ.. గతంలో క్రీడా సౌక‌ర్యాలు, స్టేడియాల ప్రమాణాలు, అథ్లెట్లు ప్రాక్టీస్ చేసేందుకు సదుపాయాలు, ప‌ర్యాట‌కులు, పాత్రికేయుల రవాణా, వసతి, భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునేది. పోటీ పడే దేశాల్లో ఏవి ఈ అంశాల్లో ముందున్నాయనే దానిని బట్టి ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ(ఐవోసీ) పోలింగ్ ద్వారా ఎంపిక చేసేది. అయితే.. ఈసారి కమిటీ.. ఈ పనిని రెండు కమిటీలకు అప్పగించింది. వారి సిఫారసు మేరకు దేశాలను షార్ట్ లిస్ట్ చేసి ఐఓసీ ఆతిథ్య దేశాన్ని ప్రకటించనుంది.

 

2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఐఓసీ 2025 నుంచి 2029 మధ్యలో ప్రకటించనుంది. ఇప్పుడున్న అభిప్రాయం ప్రకారం.. మౌలికసదుపాయాల పరంగా, ఆర్థిక వనరుల పరంగా దేశంలో అహ్మదాబాద్ నగరమే ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వగలదని మనదేశంలోని చాలామంది క్రీడా నిపుణుల అభిప్రాయం. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ క్రీడలకు తమ రాష్ట్రంలో ఆతిథ్యమిచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు.

 

భవిష్యత్తులో తమ దేశాలను ఆర్థిక, టూరిజం పరంగా బలోపేతం చేసుకోవటంతో బాటు తమ పరపతిని పొరుగుదేశాల్లో పెంచుకోవటం కోసమే పలు దేశాలు ఈ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు తపన పడుతుంటాయి. అయితే.. ఈ క్రీడల కారణంగా దివాలా దీసిన దేశాలూ ఉన్నాయి గనుక అత్యంత జనాభా గల భారత్ గొప్పలకు పోకుండా, ఈ విషయంలో కాస్త వాస్తవిక ధోరణితో ఆలోచించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.