సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉజ్వల లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఉజ్వల లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్ (LPG)పై ఇస్తున్న రాయితీ గడువును పొడిగించింది. ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం రూ. 300 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి(2025 మార్చి వరకు) ఈ రాయితీని వర్తింపజేసింది.
ఏడాదికి 12 సిలిండర్లు వరకు ఈ రాయితీ లభిస్తుంది. మార్చి 31తో ఈ గడువు ముగియనున్నవేళ ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ ఖజానాపై రూ. 12 వేల కోట్ల భారం పడనుందని వివరించారు.
కాగా, 2016లో ఉజ్వల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇస్తారు. సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 2022లో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవారికి ఒక్కో సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. అయితే, గత అక్టోబర్‌లో సబ్సిడీ మొత్తాన్ని రూ. 300కు పెంచింది.
మరోవైపు, ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో గత ఆగస్టులో రూ. 200 చొప్పున గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడంతో ఇక ఉజ్వల లబ్ధిదారులతోపాటు ఇతర గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది.