National

కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన మమత..

దేశంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇంకో రెండు మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో ఈ షెడ్యూల్‌ను విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్.. చర్యలు తీసుకుంటోంది. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

 

ఈ క్రమంలో ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఈ అలయెన్స్‌లో కీలకంగా వ్యవహరిస్తోన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ.. చెప్పింది చేసి చూపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు మరోసారి ఆమె ప్రకటించారు.

 

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వాటి పంపకాలపై ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రాష్ట్రంలో ఉన్న 42 లోక్‌సభ స్థానాల్లో రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని తృణమూల్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ మాత్రం ఎనిమిది నుంచి 14 స్థానాలను డిమాండ్ చేసింది.

 

దీనిపై ఈ రెండు పార్టీల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. చర్చలు విఫలం అయ్యాయి. రెండు లోక్‌సభ స్థానాలను తీసుకోవడానికి అటు కాంగ్రెస్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మమత బెనర్జీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఎలాంటి పొత్తులూ ఉండబోవని స్పష్టం చేశారు.

 

కోల్‌కతలో ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించారు మమత బెనర్జీ. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ఎవ్వరితోనూ పొత్తులు లేవని తేల్చి చెప్పారు. ఒంటరిగా పోరాడబోతోన్నామని స్పష్టం చేశారు. 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో 42 మంది తృణమూల్ అభ్యర్థులను నిలబెట్టనున్నామని అన్నారు. వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.