వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన మూడు పార్టీల కీలక భేటీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. అయితే, సీట్ల పంపకాల్లో మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాన్ తగ్గడం గమనార్హం. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ ఒక సీటును బీజేపీకి ఇచ్చింది.
ఈ పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు దక్కాయి. ఇందులో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుండగా.. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీ దిగనుంది. మొదట జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు దక్కగా.. ఇప్పుడు మూడు సీట్లను తగ్గించుకుని 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు. ఓట్లు చీలకూడదనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డబుల్ డిజిట్ కావాలని బీజేపీ పట్టుబట్టడంతో ఆ పార్టీకి 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు.
కాగా, దాదాపు 8 గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ పాండా ఈ సమావేశంలో పాల్గొని సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే జనసేన పోటీ చేసే ఏడు అసెంబ్లీ స్థానాలను జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే. నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
మిగిలిన 24 స్థానాల నుంచి ఎవరెక్కడ పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ ప్రకటిస్తుందనుకుంటున్న ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఏపీ నుంచి పోటీ చేసే పలువురు అభ్యర్థుల పేర్లు ఉండవచ్చని సమాచారం. కాగా, చిలకలూరిపేట బొప్పూడిలో మార్చి 17న టీడీపీ-బీజేపీ-జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాగా, టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయని, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుందని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు.