AP

జగన్ మేనిఫెస్టో.. 2019 నవరత్నాలకు మించి – గేమ్ ఛేంజర్..!!

ఏపీ ఎన్నికల్లో గెలుపు సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. మరో వైపు కాంగ్రెస్ వామపక్షాలతో మరో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ సమయం లో తాను సింగిల్ గానే పోటీ చేస్తానని జగన్ ప్రకటించారు. తాను చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం మరోసారి గెలిపిస్తాయని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే హామీలో మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

వైసీపీ మేనిఫెస్టో

 

ఏపీలో మరోసారి గెలవాలంటే జగన్ సంక్షేమ ఓట్ బ్యాంక్ నే నమ్ముకుంటున్నారు. 2019 ఎన్నికల్లో గెలిపించిన నవరత్నాలను మించిన సంక్షేమానికి బాటలు వేస్తూ మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. త్వరలో నే మేనిఫెస్టో విడుదల చేస్తామని తాజాగా అద్దంకి సిద్దం సభలో జగన్ ప్రకటించారు. చేయగలిగినవే తాను చెబుతానని.. చెప్పనివి కూడా చేస్తానని స్పష్టం చేసారు.

 

తాను అమలు చేస్తున్న సంక్షేమ నిర్ణయాల్లో కొన్నింటిని ఎవరూ టచ్ చేయలేరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రకటించిన తాజా హామీలతో పాటుగా సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఎంత ఖర్చు అయ్యేదీ వివరించారు. చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరని జగన్ ప్రజలకు వివరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

 

సంక్షేమ బావుటా సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో మరోసారి సంక్షేమ బావుటా ఎగురవేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఏపీలో మ‌ళ్లీ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసేలా తయారుచేస్తున్నారు. వైసీపీ ప్రధాన ఓట్ బ్యాంక్ గా ఉన్న మహిళలకు లబ్ది చేకూరేలా నిర్ణయాలు ఉండనున్నాయి. రైతు భరోసా నిధులను రూ 20 వేల వరకు పెంచే అవకాశం ఉంది.

 

ప్రస్తుతం ఒక పిల్ల లేదా పిల్లవాడికే అమలు చేస్తున్న అమ్మఒడి ఇక నుంచి ఇద్దరికి అమలు చేసేలా ప్రకటన ఉంటుందని సమాచారం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ 2 వేల నుంచి రూ 3 వేలకు పెంచారు. ఈ సారి అధికారంలోకి వస్తే రూ 3 వేల నుంచి రూ 4 వేలకు పెంచేలా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

 

కొత్త హామీలతో ఇక, డ్వాక్రా మహిళలకు జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతల్లో రుణ మాఫీ అమలు చేసారు. ఈ సారి మహిళలకు మరింత మేలు జరిగేలా ప్రతీ ఏటా ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక.. గ్యాస్ సిలిండర్ల పైన సబ్సిడీ గురించి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రైతు రుణ మాఫీ ప్రకటన చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

 

అయితే, రుణమాఫీ ఎంత మేర ప్రకటిస్తారు.. అందుకు జగన్ సిద్దంగా ఉన్నారా లేరా అనేది స్పష్టత రావాల్సి ఉంది. 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో 99 శాతం అమలు చేసామని చెబుతున్న జగన్..తాము హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం వేళ ఈ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది.