National

ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ కీలక నిర్ణయం..! ..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి అదృష్టం పరీక్షించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. అదే సమయంలో ఏ రాజకీయ పార్టీ ముందుంది, ఏ అభ్యర్ధికి ప్రజల్లో ఆదరణ ఉందన్న దానిపై సర్వేలు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహణలో ఏజెన్సీలు తలమునకలై ఉన్నాయి. దీంతో నిత్యం ఎన్నో సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపై ఇప్పటివరకూ ఎన్నో సర్వేలు వచ్చేశాయి.

 

అయితే సాధారణ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ కూ, ఎగ్జిట్ పోల్స్ కూ వ్యత్యాసం ఉంది. ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్, సర్వేలు నిర్వహిస్తారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అలా కాదు. ఎన్నికల్లో జనం ఎవరికి ఓటు వేశారో తెలుసుకుని వాటి ఆధారంగా విజేతలను ప్రకటించడానికి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు. ఇలా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా ఎన్నికల తంతు ముగిశాక వెల్లడవుతాయి. ఆలోపు వెల్లడయ్యే అవకాశం లేదు. కానీ ఇదంతా ఓ దశలోనే సాగిపోయే ఎన్నికలకు. కానీ ఇప్పుడు దేశంలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ఫలితాల వెల్లడితో సమస్యలు ఎదురవుతాయి.

 

ఓ దశ ఎన్నికల తర్వాత దాని ఎగ్జిట్ పోల్ విడుదల చేస్తే దాని ప్రభావం మిగతా దశల్లో జరిగే ఎన్నికలపై పడుతుంది. అందుకే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అంటే ఏడు దశలూ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించేలా ఈసీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19 నుంచి చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1 వరకూ ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకుండా ఈసీ నిషేధం విధించింది. అంటే జూన్ 1 సాయంత్రం ఏడో దశ పోలింగ్ ముగిశాక మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు వీలుంటుంది.