నూతన ఏడాది ప్రారంభమైన తొలి రోజే దేశవ్యాప్తంగా రైతన్నలపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి, కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతన్నలకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.
కొత్త సంవత్సరంలో కేంద్ర కేబినెట్ సమావేశాన్ని జనవరి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ, హాజరు కాగా రైతన్నలకు సంబంధించిన పలు పథకాలపై సుదీర్ఘ చర్చ సాగింది. ఇప్పటివరకు రైతన్నలకు వర్తిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మరింత విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో, నష్టపరిహారాన్ని పెంచినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రూ. 69515 కోట్ల రూపాయల లబ్ధికి కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది రైతన్నలకు, ఆర్థిక భరోసా కలగనుంది. కేంద్రం అందించే పంట నష్ట సాయంను 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు భాగస్వామ్యం అవుతుండగా, ఈశాన్య రాష్ట్రాలకు 90% మిగిలిన రాష్ట్రాలకు 50% కేంద్రం భరించనుంది. అంతేకాదు మరో శుభవార్తను సైతం కేంద్రం ప్రకటించింది. డీఏపీ ఎరువుల బస్తాలను కేవలం రూ. 1350 లకే అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ప్రధానంగా రైతన్నలు ఏ పంట సాగుచేసినా, డీఎపీ ఎరువులను అధికంగా వినియోగిస్తారు. డీఏపీ ఎరువులపై అదనపు భారంను కేంద్రం భరించాలని కేబినెట్ మీటింగ్ లో నిర్ణయించింది. డీఏపీ ఎరువుల సబ్సిడీకి అదనంగా రూ. 3850 కోట్లను కేటాయించింది. 2014-24 వరకు ఎరువుల సబ్సిడీకి రూ. 11.9 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, 2024 లో మూడోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 లక్షల కోట్ల తో 23 కీలక నిర్ణయాలను రైతుల కోసం కేంద్రం తీసుకుంది..
మొత్తం మీద కేంద్రం ఎరువుల బస్తాల ధరలను తగ్గించడంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 ఏడాదిని రైతు సంక్షేమ ఏడాదిగా కేంద్రం నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర తొలి క్యాబినెట్ సమావేశంలో అన్నదాతల సమస్యలపై ప్రత్యేక చర్చ సాగిందన్నారు. భారతదేశానికి వెన్నెముక లాంటి రైతన్నలను ఆదుకునేందుకు కేంద్రం ఎప్పుడు ముందుంటుందని, అందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. ఏది ఏమైనా తొలి ఏడాది తొలి రోజు రైతన్నలపై కేంద్రం వరాల జల్లు కురిపించిందని చెప్పవచ్చు.