దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో జ్ఞానేష్ కుమార్ ను తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికోసం ఫిబ్రవరి 17న ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవికి ఎంపిక కమిటీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను పంపుతుంది. సమాచారం ప్రకారం.. ఎంపిక కమిటీ 480 మందికి పైగా అభ్యర్థుల నుంచి ఐదు పేర్లను ఎంపిక చేసింది.
ముందంజలో జ్ఞానేష్ కుమార్ పేరు
ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవికి పోటీలో జ్ఞానేష్ కుమార్ ముందంజలో ఉన్నారు. అయితే సుఖ్బీర్ సింగ్ సంధు పేరు కూడా ఉంది. వారిద్దరూ ప్రస్తుతం ఎన్నికల కమిషనర్లుకగా పని చేస్తున్నారు. ఇద్దరూ 1988 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ లు. కానీ కేరళ కేడర్ కు చెందిన జ్ఞానేష్ కుమార్ సీనియర్ కావడం గమనార్హం. సీనియారిటీ ప్రకారం తదుపరి సీఈసీ జ్ఞానేష్ కుమార్ అవుతారని సమాచారం. కానీ కేంద్ర న్యాయ మంత్రి, ఇద్దరు కేంద్ర కార్యదర్శులతో కూడిన కమిటీ ప్రతిపాదించిన ఐదు పేర్లతో పాటు ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీకి కూడా సీఈసీ కోసం ఒక పేరును ఎంపిక చేసే హక్కు ఉంది. అనంతరం రాష్ట్రపతి ఏ పేరును ఆమోదిస్తే ఆయన దేశ తదుపరి సీఈసీ అవుతారు.
Who Will be the Next New Chief Election Commissioner After Rajiv Kumar Gyanesh Kumar is Front
జ్ఞానేష్ కుమార్ ఎవరు?
జ్ఞానేష్ కుమార్ కేరళ కేడర్ కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఎన్నికల కమిషనర్ పదవిలో పని చేస్తున్నారు. గత సంవత్సరం జనవరి 31, 2024న అమిత్ షా ఆధ్యర్యంలోని సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శి పదవి నుంచి పదవీ విరమణ చేశారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు సమయంలో అమిత్ షా నేతృత్వంలోని హోంమంత్రిత్వ శాఖ కాశ్మీర్ డివిజన్ కు జాయింట్ సెక్రటరీగా ఆయన నియమితులయ్యారు. ఈ సున్నితమైన సమస్యను పరిష్కరించడంలో జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన హోంమంత్రి అమిత్ షాతో కలిసి పని చేశారు. ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2020లో జ్ఞానేష్ కుమార్ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన హోంమంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక డెస్క్ ను నిర్వహించేవారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు నిర్ణయానికి సంబంధించిన అన్ని విషయాలను ఈ డెస్క్ పరిశీలించింది. ఇందులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు కూడా ఉంది.
ఫిబ్రవరి 17న జరిగే సమావేశంలో నిర్ణయం
ఫిబ్రవరి 17న జరిగే సమావేశంలో సెలక్షన్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. సీఈసీ పదవి అంటే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగేలా చూసుకోవాలి. దేశ ప్రజాస్వామ్య ప్రక్రియ విశ్వసనీయతను కాపాడుకోవడం సీఈసీ అతిపెద్ద బాధ్యత.