ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయబోతున్నట్టు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రకటించారు. తమిళనాడులో జన్మించిన రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా కూడా పని చేసిన విషయం తెలిసిందే.
సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. రెండు సార్లు కోయంబత్తూరు ఎంపీగా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతంలో జార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు. తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.
బీజేపీ పార్లమెంటరీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా సీపీ రాధాకృష్ణన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు.. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా సీపీ రాధాకృష్ణన్ పేరు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రెండు సభల్లో ఎన్డీఏ కూటమికి తగిన బలం ఉండడంతో ఉపరాష్ట్రపదవి ఎన్నిక చేయడం లాంఛనం కానుంది. ఇటీవల జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంతో వైస్ ప్రెసిడెంట్ పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే.