ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation of Delhi – MCD) ఫలితాలు వెలువడ్డాయి.
ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 250 సీట్లకు గానూ, 134 సీట్లను ఆప్, 104 స్థానాలను బీజేపీ గెల్చుకున్నాయి. కాంగ్రెస్ 9 స్థానాలకు పరిమితమైంది.
Women winners: మహిళలే మెజారిటీ..
ఈ ఎన్నికల్లో ఆప్ తరఫున విజయం సాధించిన వారిలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఆప్ నుంచి గెలిచిన 134 మందిలో 55% వరకు మహిళలే ఉండడం విశేషం. ఈ ఎన్నికల బరిలో ఆప్ 138 మహిళలను నిలిపింది. బీజేపీ 136 మంది మహిళలను, కాంగ్రెస్ 129 మంది మహిళలను పోటీలో నిలిపాయి. ఆప్ తరఫున పోటీలో నిలుచున్న 138 మంది మహిళల్లో 68 మంది విజయం సాధించారు. బీజేపీ తరఫున నిలుచున్న మహిళల్లో 52 మంది గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న షాగుఫ్తా చౌదరి 15,193 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. స్వతంత్రులుగా గెలుపొందిన ముగ్గురిలోనూ ఒకరు మహిళనే కావడం విశేషం. ఈశాన్య ఢిల్లీలోని శీలంపుర్ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా షకీలా బేగం గెలుపొందారు.
MCD polls: బీజేపీ మాజీ మహిళా మేయర్లు కూడా..
ఈ ఎన్నికల్లో ఇదే రెండో అత్యధిక మెజారిటీ. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మహిళా కౌన్సిలర్ల సంఖ్య గణనీయంగా ఉండడం సంతోషదాయకమని ఆప్ తరఫున వజీర్ పుర్ నుంచి గెలుపొందిన చిత్ర విద్యార్థి వ్యాఖ్యానించారు. అభివృద్ధే ఆప్ తారకమంత్రమని, దాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుల్తాన్ పురి నుంచి ఆప్ టికెట్ పై గెలుపొందిన ట్రాన్స్ జెండర్ బాబీ డార్లింగ్ మాట్లాడుతూ.. తన వార్డ్ ను అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతానని, ఎంసీడీలో అవినీతిపై పోరాటం చేస్తానని తెలిపారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తాకు బాగా పట్టున్న 86వ వార్డు నెంబర్ నుంచి ఆప్ మహిళా అభ్యర్థి షెల్లీ ఒబేరాయి విజయం సాధించారు. అలాగే, బీజేపీ మాజీ మహిళా మేయర్లు నీలిమ భగత్, సత్య శర్మ, కమల్జిత్ షెరావత్ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందారు.