National

2019 పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. భారత్​- పాక్​ మధ్య బంధం కనిష్ఠ స్థాయికిి

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సాధారణ విషయంగా పరిగణించవద్దని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​ పునరుద్ఘాటించారు. క్రీడా టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి, కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు ఉండదని తేల్చిచెప్పారు.

2023 ఆసియా కప్​పై బీసీసీఐ- పీసీబీ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో జైశంకర్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

2023 ఆసియా కప్​ పాకిస్థాన్​లో జరగనుంది. భారత్​- పాక్​ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ టోర్నమెంట్​కి తమ ఆటగాళ్లను పంపడం లేదని బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. బీసీసీఐ వైఖరిపై పీసీబీ మండిపడింది. ఈ క్రమంలోనే.. భారత్​ పాక్​ మ్యాచ్​లతో పాటు ఇరు దేశాల మధ్య బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు జైశంకర్​.

“నేను మళ్లీ చెబుతున్నా.. ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా హక్కుగా భావించకూడదు. దీనిని మనం వ్యతిరేకించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. ఉగ్రవాదంతో బాధితులుగా మారిన వారందరు తమ గొంతుకను వినిపించి, ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలి. ఉగ్రవాదం కారణంగా మనం చాలా రక్తాన్ని ఛిందించాము. అందుకే ఉగ్రవాద వ్యతిరేఖ పోరాటానికి మనం నాయకత్వం వహించాలి,” అని జైశంకర్​ స్పష్టం చేశారు.

‘టోర్నమెంట్​లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.. కానీ ప్రభుత్వ వైఖరి మాత్రం మారదు. ఏం జరుగుతుందో చూద్దాం..’ అని భారత్​- పాక్​ మ్యాచ్​పై స్పందించారు జైశంకర్​.

“భారత్​- పాక్​ మధ్య బంధాన్ని పునరుద్ధరించడం అనేది క్లిష్టమైన విషయం. మీ తల మీద నేను గన్​ పెడితే, మీరు నాతో మాట్లాడతారా? మీ పొరుగింటి వ్యక్తి బహిరంగంగానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే మీరేం చేస్తారు? సీమాంతర ఉగ్రవాదాన్ని సాధారణ విషయంగా పరిగణించకూడదు. ఒక పొరుగు దేశం.. మరో దేశానికి వ్యతిరేకంగా నిలబడాలని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఘటన ప్రపంచంలో వేరే ఎక్కడైనా ఉందా? ఉండదు,” అని జైశంకర్​ అన్నారు.

2008 ముంబై ఉగ్రదాడి, 2019 పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. భారత్​- పాక్​ మధ్య బంధం కనిష్ఠ స్థాయికిి చేరింది. ఈ ప్రభావం క్రికెట్​పైనా పడింది. భారత్​- పాక్​ జట్లు ద్వైపాక్షిక సిరీస్​లు ఉండటమే మానేశాయి. ఐసీసీ ఈవెంట్లలోనే ఇవి తలపడుతున్నాయి. 2023 ఆసియా కప్ కోసం పాకిస్థాన్​కు టీమ్​ఇండియా వెళితే.. పరిస్థితులు మెరుగుపడతాయని క్రికెట్​ ప్రపంచం భావించింది. కానీ ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలాగా కనిపించడం లేదు.

ఉక్రెయిన్​- రష్యా యుద్ధంపై..

Russia Ukraine war : “ప్రభుత్వం.. ప్రజల పక్షాన నిలబడింది. మా ప్రయోజనాలను మేము చూసుకోవాలి. కొన్ని దేశాలు ముందుకు రావాలి. ఈ సమస్యను పరిష్కరించాలని అందరు భావిస్తున్నారు. ఈ ప్రపంచంలోనే సుమారు 200 దేశాలున్నాయి. చాలా దేశాలు.. యుద్ధం ఆగిపోవాలనే అంటాయి. ధరలు తగ్గి, ఆంక్షలు ముగిసిపోవాలని ప్రార్థిస్తున్నాయి. నాకు తెలిసి.. ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచం, అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున శాంతి కోసం మాట్లాడుతున్నారు. అభివృద్ధి దేశాల గొంతుకగా ఎవరో ఒకరు ముందు నిలబడాలి,” అని జైశంకర్​ తెలిపారు.