National

రూ. 19వేల కోట్లకు రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ

రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో భారత దేశం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2021-22లో ఎన్నడూ లేని విధంగా రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ. 14వేల కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వెల్లడించారు. మిలిటరీ హార్డ్​వేర్​ను మిత్రపక్షాలకు ఎగుమతి చేసే విషయంలో ప్రభుత్వం చేపట్టిన సరళమైన విధానాల వల్ల ఈ రికార్డు సాధ్యమైందని అన్నారు. రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతులు.. 2014లో కేవలం రూ. 900కోట్లుగా ఉండేవని, ఇప్పుడు రూ. 14వేల కోట్లకు చేరిందని రాజ్​నాథ్​ తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. India Defence exports : “2023 నాటికి రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ. 19వేల కోట్లకు చేరుతుంది. 2025 నాటికి ఆ విలువ రూ. 25వేల కోట్లకు చేరాలన్న టార్గెట్​ను ముందే పెట్టుకున్నాము.

ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని నమ్మకంగా ఉంది,” అని రాజ్​నాథ్​ తెలిపారు. ఆత్మనిర్భర్​ భారత్​ కారణంగా.. తయారీపై భారత దేశం ఎక్కువ దృష్టిపెట్టిందన్న రాజ్​నాథ్​ సింగ్​.. ఐఎన్​ఎస్​ విక్రాంత్​ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను దేశం పూర్తిచేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రక్షణరంగంతో పాటు దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. అదే సమయంలో ‘మేక్​ ఇన్​ ఇండియా, మేక్​ ఫర్​ ది వరల్డ్​’ అనే నినాదంతో విదేశీ కంపెనీలను సైతం ఆకర్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. Rajnath Singh Defence exports : 2017- 2021 మధ్యకాలంలో భారత దేశ రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ ఆరు రెట్లు పెరిగింది. రూ. 1,520 కోట్ల నుంచి 8,435కోట్లకు చేరిందని రక్షణశాఖ డేటా వివరిస్తోంది.

ఈ నేపథ్యంలో భారత దేశ జీడీపీ అంచనాలపైనా మాట్లాడారు రాజ్​నాథ్​ సింగ్​. “2014 ముందు వరకు.. బలహీనమైన 5 దేశాల జాబితాలో భారత్​ ఉండేది. దీనికి ‘ఫ్రజైల్​ 5’ అని పేరు పెట్టింది ప్రముఖ పెట్టుబడుల సంస్థ మోర్గాన్​ స్టాన్​లీ. ఇప్పుడు ఆ జాబితాలో భారత్​ లేదు. ఉండదు కూడా! మనం అద్భుతమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నాము. 2027 నాటికి.. యూఎస్​, చైనా తర్వాత మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుందని నివేదికలు బయటకొస్తున్నాయి. రానున్న 10ఏళ్లల్లో ఇండియా జీడీపీ 8.5ట్రిలియన్​లకు చేరుతుంది. ఇది భారత్​ సత్తాకు చిహ్నం,” అని రాజ్​నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. India defence exports news : కొవిడ్​ సంక్షోభంలోనూ.. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో.. ఎఫ్​డీఐ(ఫారిన్​ డైరక్ట్​ ఇన్​వెస్ట్​మెంట్​)​ ప్రవాహం రికార్డు స్థాయిలో ఉందన్నారు రాజ్​నాథ్​ సింగ్​. 2021-22లో ఎఫ్​డీఐ విలువ రికార్డుస్థాయిలో 83.6బిలియన్​ డాలర్లకు చేరిందన్నారు.