National

రాత్రి రోడ్డుపై నడిచినందుకు దంపతులకు రూ.3,000 ఫైన్..

సాధారణంగా రాత్రివేళల్లో రోడ్లపై చాలా మంది తిరుగుతుంటారు. డిన్నర్లకో, ఫంక్షన్‍లకో వెళ్లినప్పుడు లేట్ అయితే రోడ్లపై నడిచివెళుతుంటారు.

బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఇది సర్వసాధారణం. అయితే ఇలాగే రాత్రి వేళ నడిచి వెళుతున్న దంపతులకు బెంగళూరులో వింత అనుభవం ఎదురైంది. పోలీసులు తమను వేధించారని కార్తీక్ పత్రీ అనే వ్యక్తి వెల్లడించారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై నడిచినందుకు పోలీసులు రూ.3,000 ఫైన్ వేశారని, చివరికి రూ.1,000 వసూలు చేసుకొని పంపించారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆ రాత్రి తమకు ఎదురైన భయానక అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా వివరంగా వెల్లడించారు కార్తీక్. ఆ వివరాలు ఇవే.

ఇదీ జరిగింది

Bengaluru Couple fined: రాత్రి వేళ తన భార్యతో నడిచివెళుతున్న సమయంలో తనకు ఎదురైన ఈ సంఘటన గురించి కార్తీక్ పత్రీ ట్వీట్ల ద్వారా వివరించారు. “గత రాత్రి.. నా భార్య, నేను ఎదుర్కొన్న ఓ భయానక విషయాన్ని పంచుకుంటున్నాను. స్నేహితుడి కేక్ కటింగ్ కార్యక్రమానికి హాజరై మేం ఇంటికి నడిచి వెళుతున్నాం. (మాన్యతా టెక్ పార్క్ వెనుక ఉన్న సొసైటీలో మేం ఉంటున్నాం)” అంటూ 15 ట్వీట్లలో మొత్తం విషయాన్ని చెప్పారు కార్తీక్. తమ ఇంటికి కొద్ది మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఓ పింక్ కలర్ పెట్రోలింగ్ వాహనం ఉందని, అక్కడ యూనిఫామ్‍లో ఉన్న ఇద్దరు పోలీసులు తమను ఆపారని వివరించారు.

“మమ్మల్ని వారు ఆపారు. ఐడీ కార్డులు చూపించాలని ఆడిగారు. సాధారణ రోజుల్లో వీధుల్లో తిరిగేందుకు దంపతులు ఐడీ ఎందుకు చూపించాలి?” అని పత్రీ ట్వీట్ చేశారు.

ఫోన్లు లాక్కొని..

తమ ఫోన్‍లను ఆ పోలీసులు లాక్కొని.. తమ ఆధార్ నంబర్లను చలాన్లలో రాయడం ప్రారంభించారని కార్తీక్ పత్రీ ట్విట్ చేశారు. రాత్రి 11 తర్వాత రోడ్లపై తిరగకూడదనే నిబంధన ఉందని పోలీసులు చెప్పారని తెలిపారు. తాము ఎంత బతిమాలినా విడిచిపెట్టలేదని, అరెస్ట్ చేస్తామని కూడా బెదిరించారని కార్తీక్ రాసుకొచ్చారు. ఓ దశలో తన భార్య ఏడ్చేసిందని వెల్లడించారు. రూ.3,000 జరిమానా చెల్లిస్తేనే వదిలిపెడతామని ఆ ఇద్దరు పోలీసులు చెప్పారని కార్తీ వివరించారు.

“రూ.3,000 జరిమానా కట్టాలని డిమాండ్ చేశారు. మాకు భయమేసింది. మమ్మల్ని పంపించాలని బతిమాలినా వారు పట్టించుకోలేదు. కఠినంగా మాట్లాడారు. కొందరి నేరస్థుల ఫొటోలను చూపిస్తూ అరెస్ట్ చేస్తామని బెదిరించారు. వేధించారు. డబ్బు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు” అని కార్తీ పత్రీ ట్వీట్ చేశారు.

కాసేపటి తర్వాత ఓ కానిస్టేబుల్ తనను పక్కకు తీసుకెళ్లి బేరాలు ఆడారని కార్తీక్ పత్రీ వెల్లడించారు. కనీసం రూ.1,000 ఇస్తే వదిలేస్తామని అడిగారని చెప్పారు. ఆ తర్వాత పేటీఎం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తాను రూ.1,000 చెల్లించామని కార్తీక్ పత్రీ రాసుకొచ్చారు.

ఆ రాత్రి ఇంటికి వెళ్లాక కూడా తాము భయంతోనే ఉన్నామని, నిద్ర కూడా పట్టలేదని కార్తీక్ పత్రీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. బెంగళూరు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ వారికి ట్యాగ్ చేశారు. దీంతో ఆ ట్వీట్లకు బెంగళూరు పోలీసులు స్పందించారు. సంపిగహళ్లి పోలీస్ స్టేషన్‍కు చెందిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.