NationalWorld

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌..

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌ కోరింది.

ఆర్థిక నేరస్తులను అప్పగించడమే కాదు, వారి నుండి దేశ విదేశాల్లో ఆస్తుల రికవరీ కూడా జరిగేలా చూడాల్సి వుందని కోరింది. దేశ రాజధాని శివార్లలోని గుర్‌గావ్‌లో అవినీతి నిరోధక వర్కింగ్‌ గ్రూపు మొదటి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఇటలీ ప్రతినిధితో కలిసి కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ అధ్యక్షత వహించారు. ఆర్థిక నేరాలనే సమస్యను ఈనాడు చాలా దేశాలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ముఖ్యంగా ఆర్థిక నేరస్తులు దేశ న్యాయ పరిధిని దాటి పారిపోవడమే అతిపెద్ద సవాలుగా మారుతోందన్నారు. ఇందుకు సంబంధించి భారతదేశం ప్రత్యేక చట్టం ఫ్యుజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్స్‌ యాక్ట్‌, 2018ని తీసుకువచ్చిందని సింగ్‌ చెప్పారు. ఇలా ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వారివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు 27,200కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లింది. అలా నష్టపోయిన బ్యాంకులకు 18వేల కోట్ల డాలర్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బదిలీ చేసిందని సింగ్‌ చెప్పారు. దేశ విదేశాల్లో జరిగే ఈ నేరాలకు సంబంధించి సత్వరగతిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన యంత్రాంగాన్ని బలోపేతం చేయాలన్నది భారత్‌ లక్ష్యమని సింగ్‌ జి 20 ప్రతినిధులకు తెలియచేశారు. ఆర్థిక నేరస్తులు వారి స్వదేశానికి వచ్చేలా వారిపై ఒత్తిడి తీసుకురావాల్సి వుందన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడి అరెస్టును, క్రిమినల్‌ దర్యాప్తును తప్పించుకోవడానికి గానూ దేశం విడిచి పారిపోయే వారిని పారిపోయిన ఆర్థిక నేరస్తులుగా (ఎఫ్‌ఇఓ) పేర్కొంటారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రాథమిక వేదిక అయిన జి 20 బాధ్యత తీసుకుని అవినీతి నిర్మూలనపై పోరాడే దిశగా చర్యలు తీసుకోవాల్సి వుందని సింగ్‌ పేర్కొన్నారు. కాగా, జి-20 సమావేశాలకు దక్షిణ కొరియా, జపాన్‌ విదేశాంగ మంత్రులు డుమ్మా కొట్టారు. గత వారం ఆర్థిక మంత్రుల సమావేశాలు విఫలమయ్యాయి. దీంతో, ఈ సమావేశాలపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.

గ్యాస్‌ పైప్‌లైన్‌పై బాంబింగ్‌ను ప్రశిుంచనున్న రష్యా
నార్డ్‌ స్ట్రీమ్‌ 2 గ్యాస్‌ పైప్‌లైన్‌పై బాంబు దాడి అంశాన్ని విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రస్తావించాలని రష్యా భావిస్తోంది. ఈ విషయమై ఇయు, నాటోలను ప్రశిుంచాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రొవ్‌ భావిస్తున్నారు. అలాగే స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం జరపడంపై జై శంకర్‌తో చర్చించనున్నారు.

బిబిసి కార్యాలయాలపై ఐటి సర్వేలను జై శంకర్‌తో ప్రస్తావించిన బ్రిటన్‌ మంత్రి
ముంబయి, ఢిల్లీల్లో బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బిబిసి) కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ ఇటీవల జరిపిన దాడుల గురించి బ్రిటీష్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లవర్లీ బుధవారం భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ వద్ద ప్రస్తావించారు. దీనికి జై శంకర్‌ బదులిస్తూ దేశంలో పనిచేసే అన్ని సంస్థలూ భారతీయ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుందని చెప్పారు. ఐటి దాడులు గురించి బ్రిటన్‌ ప్రభుత్వం ఇలా బహిరంగంగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు పార్లమెంట్‌లోనూ దీనిపై చర్చ నడిచింది. గుజరాత్‌ అల్లర్లలో మోడీ పాత్రపై బిబిసి రెండు భాగాలుగా ఒక డాక్యుమెంటరీని విడుదల చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం దాన్ని అడ్డుకుంది. ఆ వెనువెంటనే ఐటి విభాగం సర్వే పేరుతో బిబిసి సోదాలు, గాలింపులు జరిగాయి.