World

చర్చలకు సిద్ధమని ప్రకటించిన పుతిన్​..

ఉక్రెయిన్​తో యుద్ధంలో సంబంధం ఉన్న వారందరితో చర్చలకు సిద్ధమని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. కానీ ఉక్రెయిన్​, దాని పాశ్చాత్య మిత్రపక్షాలు మాత్రం చర్చల కోసం ముందుకు రావడం లేదని ఆరోపించారు. రష్యా మీడియా ఆదివారం విడుదల చేసిన ఓ ఇంటర్వ్యూలో పుతిన్​ ఈ మేరకు వ్యాఖ్యానించారు. Russia Ukraine war : “యుద్ధంతో సంబంధం ఉన్న వారందరితో చర్చలు జరపడానికి మేము సిద్ధం. ఆమోదయోగ్యమైన పరిష్కారాలు ఇస్తే చర్చలు జరుపుతాము. కానీ చర్చలనేది వారి చేతుల్లోనే ఉంది. చర్చలను మేము అడ్డుకోవడం లేదు. ఉక్రెయిన్​, దాని మిత్ర దేశాలే అడ్డుకుంటున్నాయి,” అని ఆరోపించారు పుతిన్​. ఉక్రెయిన్​పై ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధానికి దిగింది రష్యా. తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఉక్రెయిన్​ ప్రవర్తిస్తోందంటూ ఆ దేశంలోకి దూసుకెళ్లింది. తమ లక్ష్యాలు నెరవేరేంత వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని అనేకమార్లు తేల్చిచెప్పింది. మరోవైపు.. తమ భూభాగంలో నుంచి రష్యన్​ సైనికులను తరిమికొట్టేంత వరకు కూడా నిద్రపోమని ఉక్రెయిన్​ ప్రతిజ్ఞ చేసింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. Russia Ukraine peace talks : “మా దేశాన్ని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాము. సరైన మార్గంలోనే మేము నడుస్తున్నట్టు అనిపిస్తోంది. మా పౌరులను రక్షించుకోవడానికి వేరే మార్గం లేకుండా పోయింది.” అని పుతిన్​ అన్నారు.

అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు.. రష్యాలో చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోందని అనేకమార్లు ఆరోపించారు పుతిన్​. ఆయన ఆరోపణలను అమెరికా ఖండిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు.. పాశ్చాత్య దేశాలతో భేదాలు ప్రమాదకర స్థాయికి చేరాయా? అని ఓ జర్నలిస్ట్​ అడిగిన ప్రశ్నకు.. ‘ఇంకా లేదు,’ అంటూ జవాబిచ్చారు పుతిన్​. ‘చర్చలను అడ్డుకుంటోంది పుతినే..!’ Putin Russia Ukraine war : చర్చలపై పుతిన్​ మాట్లాడుతున్న తీరులో తీవ్రత లేదని ఉక్రెయిన్​ ఆరోపిస్తోంది. చర్చలను తాము అడ్డుకోవడం లేదని, రష్యా అధ్యక్షుడే శాంతికి సిద్ధంగా లేరని విమర్శిస్తోంది. ‘ఉక్రెయిన్​పై దాడి చేసింది రష్యానే. మా పౌరులను చంపింది కూడా రష్యానే. ఈ విషయం అందరికి తెలిసిందే. వాస్తవానికి రష్యాకు చర్చలు జరిపే ఉద్దేశం లేదు. బాధ్యతల నుంచి తప్పించుకుని తిరగడమే రష్యా పని,’ అని ఉక్రెయిన్​ అధ్యక్షుడు వ్లాదిమిర్​ జెలెన్​స్కీ సలహాదారు పోడోలైక్​ మండిపడ్డారు. ఉక్రెయిన్​- రష్యా చర్చలపై సీఐఏ డైరక్టర్​ విలియమ్​ బర్న్స్​ సైతం ఇటీవలే స్పందించారు. చర్చల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కారమైపోతాయని అభిప్రాయపడ్డారు. కానీ చర్చలు జరిపే విషయంలో రష్యా సీరియస్​గా లేదని పేర్కొన్నారు. Putin Zelensky talks : రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం మొదలై 300 రోజులు గడిచిపోయింది. యుద్ధం ముగింపు కోసం ప్రపంచ దేశాల ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. పుతిన్​ తాజా వ్యాఖ్యలతో యుద్ధం ఏ విధంగా మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.