అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై అనధికారిక సమాచారం బయటకు వచ్చింది. పదో తేదీన ఈ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సమావేశ ఏజెండా కుటుంబమా లేకపోతే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్పందించాల్సి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్పగా స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈ అంశంపై టీడీపీ కార్యకర్తలు జూనియర్ విమర్శలు చేశారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడల్లా రాజకీయాల జోలికి రాదల్చుకోలేదని.. సినీ రంగంలోనే ఉన్నత స్థానానికి వెళ్లిన తర్వాత రాజకీయ కెరీర్ గురించి ఆలోచించాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్ తో గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారానికి తాజా భేటీ ద్వారా పులిస్టాప్ పడుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అగ్రనేత అమిత్ షా గత ఏడాది హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపింది. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఏయే అంశాలపై చర్చించారనేది అప్పట్లో రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.