NationalPOLITICSTELANGANA

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు బిగిస్తున్నారు. మహారాష్ట్రలో బలంగా పాగా వేయడానికి గట్టిగానే ఫోకస్ చేశారు. ఇప్పటికి మూడు దఫాలుగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన కేసీఆర్, అక్కడ వివిధ పార్టీల నాయకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.

 

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ కు చెందిన నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ రోజు కెసిఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారిలో ఆల్ ఇండియా డీఎన్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఓ బి సి వెల్ఫేర్ సంఘం నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆనందరావ్ అంగళ్వార్ సహా సుమారు 40మంది నాయకులు ఉన్నారు.

మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగురవేయాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికలలో విజయ శంఖం పూరించాలి అని కెసిఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర లో బి ఆర్ ఎస్ పార్టీ కి ఏం పని అని ఫడ్నవీస్ అంటున్నారని, తెలంగాణ మోడల్ అమలు చేస్తే వెళ్ళిపోతామని చెప్పామని, అయితే ఫడ్నవిస్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదన్నారు.

దేశంలోనే తెలంగాణ మోడల్ ఎక్కడాలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో కావలసినంత నీరు ఉందని అయినా ఎందుకు ఇవ్వలేక పోతున్నారని కెసిఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలోనూ ప్రతీ ఎకరానికి నీరు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమన్నారు. మహారాష్ట్రలో పెన్ గంగా, గోదావరి, వార్ధా నదులు ఉన్నా ఎందుకు తాగునీటికి, సాగునీటికి కష్టాలు ఉన్నాయని ప్రశ్నించారు. మహారాష్ట్రలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ప్రశ్నించారు.

తెలంగాణాలో రైతులకు ప్రభుత్వం అండగా ఉండటంతో తెలంగాణాలో రైతుల ఆత్మహత్యలు ఆగాయని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో మహారాష్ట్రలో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీలను ఏర్పాటు చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులకు గులాబీ బాస్ కెసిఆర్ సూచించారు.