చాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పుకోబోతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై రోహిత్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. గత రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టాడు.
తన భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు లేవని, కాబట్టి రిటైర్మెంట్‌కు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరాడు. వన్డే ఫార్మాట్ నుంచి తాను ఇప్పుడే రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. సుదీర్ఘమైన క్రికెట్ ఆడిన వారికి ఇంకా ఆడాలని ఉంటుందని, అయితే, ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తుందని రోహిత్ పేర్కొన్నాడు.
చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ఆనందంగా ఉందన్న రోహిత్.. టోర్నీ మొత్తం బాగా ఆడినట్టు చెప్పాడు. జట్టు తనకు అండగా నిలిచిందని పేర్కొన్నాడు. 2023 ప్రపంచకప్ సమయంలో రాహుల్ ద్రవిడ్‌తో, ఇప్పుడు గౌతం గంభీర్‌తో మాట్లాడానని అన్నాడు. ఇన్నాళ్లు తాను విభిన్న శైలితోనే ఆడానని, ఇప్పుడీ విజయంతో ఫలితాన్ని చూశామని వివరించాడు. ఇలాంటి పిచ్‌పై ఆడేటప్పుడు పరిస్థితులను అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. తొలి ఆరు ఓవర్లపాటు ఎలా ఆడాలో పూర్తి స్పష్టతతో ఉన్నానని, ఒకవేళ తాను ఔటైనా తమ ప్రణాళిక అమలు చేయాలని అనుకున్నామని వివరించాడు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉండటం తమలో విశ్వాసాన్ని నింపిందని రోహిత్ చెప్పుకొచ్చాడు.