క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎన్నో అద్భుతమైన రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. సచిన్ సాధించిన రికార్డులను భవిష్యత్తులో కూడా ఏ ఒక్క క్రికెటర్ సాధించలేడేమో అనుకునేంతగా ఆయన రికార్డుల పరంపర కొనసాగించాడు. అంతటి సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆటలో సరింగా రాణించలేక పోతున్నాడంటూ అభిమానులు గత కొంత కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఎట్టకేలకు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా రంజీ ట్రోఫీలో సెంచరీ కొట్టి సత్తా చాటాడు. రంజీ మ్యాచ్ లో గోవా తరపున నైట్ వాచ్మెన్ బ్యాట్స్మెన్ గా బరిలోకి దిగిన అర్జున్ టెండూల్కర్ అనూహ్యంగా గోవా జట్టు భారీ స్కోరు దిశగా దూసుకు వెళ్లే విధంగా స్కోర్ ని రాబట్టాడు. గతంలో ముంబై జట్టుకు ఆడిన అర్జున్ టెండూల్కర్ ఈసారి గోవా జట్టుకి రంజీలో ఆడుతున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ లో భాగంగా రాజస్థాన్, గోవా జట్ల మధ్య రంజీ మ్యాచ్లో 207 బంతుల్లో 16 ఫోర్లు రెండు సిక్సులు సాధించి 120 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సుయాంశ్ ప్రభుదేశాయ్ 212 (నాటౌట్) పరుగులు చేసి భారీ స్కోరు దిశగా గోవా జట్టును తీసుకెళ్లారు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 493 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు నష్టపోయారు.