వరదలు అంటే అమ్మో అంటాం.. భూమి కాస్త కంపిస్తే గజగజా వణికిపోతాం. వడగాలులకు భయపడి ఎవరికి వాళ్లు హౌస్ అరెస్ట్ అయిపోతారు. కానీ.. వీటన్నింటికన్నా ప్రమాదకారి పిడుగు.
గాయపరచడం ఉండదు. అనారోగ్యానికి గురిచేసే సమస్యేలేదు. సెకన్లలో ప్రాణం తీసేస్తుంది. ఓ మెరుపులా ఉన్నా.. అది తాకితే వేల ఓట్ల విద్యుత్ ఒంట్లోకి చేరి క్షణాల్లో మనిషిని బూడిద చేస్తుంది.
ఇలాంటి భయంకరమైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ కార్మికుడిపై పిడుగు పడింది. దాంతో అతను స్పాట్‌లో కుప్పకూలిపోయాడు. ఈ మాటలకందని విషాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రాపూర్ జిల్లా భద్రావతి తాలూకా మజ్రీ బొగ్గు గనిలో పని చేస్తున్న కార్మికుడు.. పని ప్రదేశం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అంతలో ఆకాశం నుంచి ప్రకాశవంతమైన మెరుపు అతనిపై పడింది. పిడుగు ధాటికి బాధిత కార్మికుడు.. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బీహార్ రాష్ట్ర వాసిగా గుర్తించారు. కాగా, పిడుగుపాటు దృశ్యాలు.. అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.