APTELANGANA

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు

చ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో కటువైన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

పార్టీలో ఎంత సీనియర్ నాయకుడైనప్పటికీ గెలుపునకు అవకాశాలు లేకపోతే రానున్న ఎన్నికల్లో పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈకోవలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం చేరుతోంది.

నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదంటూ.. : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 1999 నుంచి చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధ్యలో 2004, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజాగా పుల్లారావుకు ధీటుగా నియోజకవర్గంలో మరో వర్గం తయారైంది. భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇక్కడ వరుసగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పుల్లారావు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో లేరని, నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేదంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతర్గతంగా పార్టీ చేయించుకున్న దర్యాప్తులో పుల్లారావుపై అవినీతి ఆరోపణలు రావడం కూడా మైనస్ గా మారిందని, అభ్యర్థిని మారిస్తే విజయావకాశాలుంటాయని తేలింది.

నాకు తెలియకుండానే జరుగుతున్నాయి..: వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం ప్రాధాన్యత కల్పించబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రవీణ్ వర్గం ప్రచారం చేస్తోంది. తనకు తెలియకుండా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ చంద్రబాబుకు పుల్లారావు ఫిర్యాదు చేశారు.

ఇద్దరు నేతలతో మాట్లాడిన అచ్చెన్న: బాబు ఆదేశాల మేరకు పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పుల్లారావుతో, ప్రవీణ్ తో మాట్లాడారు. జరుగుతున్న పార్టీ కార్యక్రమాలవల్ల తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, కానీ తనను పక్కన పెట్టారంటూ జరుగుతున్న ప్రచారమే బాధిస్తోందని పుల్లారావు చెప్పారు. కమ్యూనికేషన్ సరిగా లేకపోవడంవల్ల ఇబ్బంది కలిగిందని ప్రవీణ్ చెప్పారు. ఇద్దరు నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను అచ్చెన్నాయుడు చంద్రబాబుకు నివేదించారు. ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉండటంతో ఇద్దరి సేవలు పార్టీకి ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. సీటు ఎవరికివ్వాలనే విషయాన్ని మాత్రం ఎన్నికల సమయంలోనే తేల్చనున్నట్లు స్పష్టమవుతోంది.