ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి స్పందించింది. కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధించిన అనంతరం ఆర్బీఐ స్పందించడం ఇదే రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ప్రకటన తరువాత పేటీఎం షేర్ల ధరలు ఢమాల్ అయ్యాయి. పాతాళానికి పడిపోయాయి. ఒకదశలో 52 వారాల్లో గరిష్ఠంగా 998 రూపాయల వరకు వెళ్లిన వాటి షేర్ ప్రైస్ ఒక్కసారిగా కూప్పకూలింది. 300 రూపాయలకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో పేటీఎం యాజమాన్యానికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది రిజర్వు బ్యాంక్.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై విధించిన నిషేధాన్ని సడలించింది. ఈ నెల 29వ తేదీ నుంచి అమలు కావాల్సిన నిషేధం గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగించింది. అంటే.. మార్చి 14వ తేదీ వరకూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, వ్యాలెట్, ఫాస్టాగ్ పని చేస్తాయి.
నిషేధం అమలు గడువును ఆర్బీఐ పొడిగించిన నేపథ్యంలో పేటీఎం షేర్ల ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ఈ సడలింపు ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రతి రోజూ అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అవుతూ వస్తోన్నాయి పేటీఎం షేర్ల ధరలు. అయిదు శాతం మేర పెరుగుతూ వస్తోన్నాయి. నేడు పేటీఎం ఒక్కో షేర్ ధర రూ.428.10 పైసల వద్ద ట్రేడ్ అయింది.
అంతా సజావుగా సాగుతోందనుకున్న ఈ దశలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది పేటీఎంలో. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్‌గా విజయ్ శేఖర్ శర్మ వైదొలిగారు. ప్రస్తుతం ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. అలాగే- బోర్డు సభ్యుడిగానూ వ్యవహరిస్తోన్నారు. పేటీఎం ఫౌండర్ ఆయనే.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలన్నీ కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోకి వెళ్తుందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఈ సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది పేటీఎం సంస్థ.