National

కొత్త పార్టీ ఎంట్రీతో.. త్రిపురలో బీజేపీకి చిక్కులు!

త్రిపురలో ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలన్నీ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈక్రమంలో అధికార బీజేపీని ఓడించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బద్ధ శత్రువులగా ఉండే కాంగ్రెస్​, వామపక్షాలు కలిసిపోయాయి. బీజేపీకి ఇదొక చిక్కు అయితే.. వీటి మధ్య ఈ దఫా ఎన్నికల్లో కొత్త పార్టీ పోటీచేస్తుండటం మరో సమస్య! అదే.. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రద్యుత్​ బిక్రమ్​ మానిక్య దేబ్​ బర్మ స్థాపించిన టిప్రా మోతా పార్టీ. కొత్త పార్టీ ఎంట్రీతో.. రాష్ట్రంలోని ఆదివాసీ బృందాల హక్కుల రక్షణ కోసం టిప్రా మోతా పార్టీని స్థాపించారు దేబ్​ బర్మ. వీరి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, దానికి టిప్రాల్యాండ్​ అని పేరు పెట్టాలని గత కొన్నేళ్లుగా డిమాండ్​ చేస్తున్నారు దేబ్​ బర్మ. తమ డిమాండ్​ల పరిష్కారానికి లిఖితపూర్వక లేఖ అందించే పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. TIPRA Motha party : “నేతల మాటలపై నాకు నమ్మకం లేదు. టిప్రాల్యాండ్​ ఏర్పాటుకు లిఖితపూర్వక లేఖ అందించిన పార్టీతో పొత్తు కుదుర్చుకుటాము. ఈ విషయంలో అసలు రాజీపడే అవకశం లేదు,” అని దేబ్​ బర్మ స్పష్టం చేశారు. కొండ ప్రాంతాల్లో నివాసముండే ఈ ఆదీవాసీ బృందాలకు.. రాష్ట్రంలోని 60 సీట్లల్లో 20 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

వీరి మద్దతు తమ పార్టీ ఉంటుందని దేబ్​ బర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో.. ఐపీఎఫ్​టీ (ఇండీజీనియస్​ పీపుల్స్​ ఫ్రంట్​ ఆఫ్​ త్రిపుర) అనే పార్టీతోనూ దేబ్​ బర్మ టచ్​లో ఉన్నారు. 2018 ఎన్నికల్లో 9 సీట్లల్లో పోటీ చేసిన ఈ పార్టీ.. 8 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో ఓ భాగంగా ఉంది. ఈ పార్టీని తమలో కలుపుకోవాలని దేబ్​ బర్మ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత మూడు నెలల వ్యవధిలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఐపీఎఫ్​టీ నుంచి టిప్రా మోతా పార్టీకి వలస వెళ్లిపోయారు. అనేక మంది కార్యకర్తలు సైతం.. పార్టీ జెండాను మార్చేశారు. మెర్జర్​కు ఐపీఎఫ్​టీ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. “టిప్రాల్యాండ్​ కోసం కృషి చేస్తున్న దేబ్​ బర్మ పార్టీలతో కలుస్తాము,” అని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ ప్రేమ్​ కుమార రియంగ్​ చెప్పడం గమనార్హం.