TELANGANA

ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. 50 నెలల జీతాన్ని బోనస్‍గా ఇచ్చిన ఓ సంస్థ

సాధారణంగా ఎక్కువ కంపెనీలు ఉద్యోగులకు సుమారుగా మూడు నుంచి ఆరు నెలలకు సమానమైన జీతాన్ని బోనస్‍లుగా ఇస్తుంటాయి. మరీ ఎక్కువ లాభాలను ఆర్జిస్తే మరింత ఎక్కువగా ఇస్తాయి. అయితే ఓ కంపెనీ మాత్రం ఏకంగా తమ ఉద్యోగులకు 50 నెలల వేతనానికి సమానమైన బోనస్‍ను ఒకేసారి ఇచ్చేసింది. ఉద్యోగులకు బంపర్ బొనాంజాను అందించింది. దీంతో ఆ కంపెనీ ఉద్యోగుల పంట పండింది. సిబ్బందికి ఇంత భారీ మొత్తం బోనస్ ఇచ్చింది తైవాన్‍కు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్, షిప్పింగ్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ (Evergreen Marine Corp.). పూర్తి వివరాలు ఇవే. కళ్లు చెదిరేలా ఇయర్ ఎండ్ బోనస్ Evergreen Marine Corp Bonus to Employees: ఉద్యోగులకు 50 నెలల వేతనానికి సమానమైన లేదా నాలుగు సంవత్సరాల వేతనాన్ని ఇయర్ ఎండ్ బోనస్‍గా ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ ఇచ్చింది. కంపెనీకి చెందిన వర్గాలు ఈ విషయాన్ని చెప్పినట్టు బ్లూమ్‍బర్గ్ రిపోర్ట్ చేసింది. ఉద్యోగుల గ్రేడ్, విధుల ఆధారంగా ఈ బోనస్‍లను ఇచ్చింది

ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్. తైవాన్ బేస్డ్ కాంట్రాక్టులకు చెందిన తమ ఉద్యోగులకు ఈ బంపర్ బోనస్‍ను అందించింది. సంవత్సరంలో కంపెనీ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగులకు ఇయర్ ఎండ్ బోనస్‍లు ఇస్తామని ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ పేర్కొంది. గత రెండు సంవత్సరాలుగా ఆ కంపెనీ వృద్ధి గణనీయంగా పెరిగింది. కరోనా ప్రభావం వల్ల రెండేళ్లుగా రవాణా రంగానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. రవాణా చార్జీలు కూడా భారీగా పెరిగాయి. ఇది ఎవర్‌గ్రీన్ మెరైన్ సంస్థకు కలిసి వచ్చింది. 2022లో ఆ సంస్థ ఆదాయం 20.7 బిలియన్ డాలర్లకు చేరింది. 2020తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. కంపెనీ ఆదాయం భారీగా పెరగటంతో కొందరు ఉద్యోగులకు భారీస్థాయిలో బోనస్‍లను ఇచ్చింది ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ సంస్థ. కాగా, ఈజిప్టులోని సూయిజ్ కాలువలో 2021 ప్రారంభంలో ఇరుక్కుపోయిన రవాణా నౌక ఈ సంస్థకు చెందినదే.