TELANGANA

సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరపాలి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: హిడెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదాని ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుండి 22 వ స్థానానికి పడిపోయారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అదానీ సంస్థ అనేక ప్రభుత్వరంగ సంస్థ ల నుండి అప్పులు తీసుకోవడంతో పాటు, ఎల్ ఐసీ అదానీ గ్రూప్ లో రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎస్బీఐ నుండి రూ. 27 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుయ రూ. 5,380 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7 వేల కోట్లు, ఇలా ఏడు జాతీయ బ్యాంకులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయన్నారు. హిడెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51% పడిపోగా , ఎల్ ఐసీ రూ.18 వేల కోట్లు నష్టపోయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చిరుద్యోగులు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎల్ ఐసీ షేర్లు కొని, అదానీ సంస్థ కారణంగా తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అదానీ సంస్థల కారణంగా ఎల్ ఐసీ, ఎస్బీఐ లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలు నష్టపోతున్నా ప్రధానమంత్రి మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారించాలని రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు బహిష్కరించడం, మోదీ ప్రసంగం సమయంలో వాకౌట్ చేయడంతో పాటు పార్లమెంటులో ప్రతి రోజు నిరసన తెలిపారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ర్టపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ప్రధాని మోదీ, ఒక్కసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మోదీకి ప్రజలపై పట్టింపు లేదని, తన మిత్రులైన పారిశ్రామిక వేత్తలపైనే ఎక్కువ పట్టింపు ఉందనే విషయం ఇవ్వాల్టి ప్రధానమంత్రి ప్రసంగంతో తేటతెల్లమైందన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కాపీకొట్టి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిందని, మొదటి ఏడాది 11 కోటె 84 లక్షల మంది రైతులకు రూ.6 వేలు ఇచ్చి, రెండో ఏడాది 9 కోట్ల 30 లక్షల రైతులు, ఆ తరువాత ఏడాది 9 కోట్ల రైతులు, ఆ తరువాత ఏడున్నర కోట్ల మంది రైతులు , ఈ ఏడాది 3 కోట్ల 87 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జగిత్యాల జిల్లా నుండి అకారణంగా 50 వేల మంది రైతులను, నిజామాబాద్ నుంచి 60 వేల రైతులను పీఎం కిసాన్ పథకం నుండి తొలగించారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కానీ ప్రధాని మోదీ ఈరోజు ప్రసంగంలో , ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం అమలు చేసామని నిండు సభలో అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.