హైదరాబాద్: ప్రపంచ మహిళా బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. బాక్సర్ నిఖత్ జరీన్‌కు జూబ్లీహిల్స్‌లో 600 గజాల స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.తెలంగాణ క్రీడా శాఖ తరపున ఇంటి స్థలం పట్టాను రవీంద్ర భారతిలోని మంత్రి కార్యాలయంలో.. నిఖత్ జరీన్ తండ్రి మహ్మద్ జమిల్ అహ్మద్‌కు రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. జూబ్లీహిల్స్‌లో ఇచ్చిన 600 గజాల స్థలం విలువ రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక, నిఖత్ జరీన్ కోరిక మేరకు త్వరలో ఆమెకు గ్రూప్-1 కేడర్ కింద డీఎస్పీ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిషా సింగ్ కు కూడా రూ. 2 కోట్ల నగదు, 600 గజాల స్థలం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్.. సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిందని వ్యాఖ్యానించారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గంలో ట్రైనర్లను నియమిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. భవిష్యత్తులో ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసేందుకు కొత్త క్రీడా పాలసీ తీసుకొస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవబోతోందన్నారు. తమ కూతురు ప్రతిభను గుర్తించి కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఇచ్చినందుకు జరీన్ తండ్రి మహ్మద్ జమిల్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం వల్ల తమ కుమార్తె క్రీడల్లో రాణిస్తున్నారని చెప్పారు.