TELANGANA

అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డితో కరణ్ అదానీ భేటీ

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వివిధ పరిశ్రమల ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఫాక్స్‌కాన్, అమరరాజా ప్రతినిధులు ఇప్పటికే భేటీ కాగా..

తాజాగా అదానీ గ్రూప్ ప్రతినిధులు రేవంత్‌ను సచివాలయంలో కలిశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబుడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.

అదానీ సంస్థ ప్రతినిధులు, గౌతం అదానీ కుమారుడు కరణ్ అదానీ (Karan Adani) బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిశారు. అదానీ పోర్ట్స్ – సెజ్ సీఈఓ గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీతోపాటు అదానీ ఏరో స్పేస్ సీఈవో ఆశీష్ రాజ్ వన్షిలతో సీఎం చర్చలు జరిపారు. ప్రభుత్వం మారినప్పటికీ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో తమ కంపెనీ ముందుంటుందని అదానీ గ్రూప్ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.

ఇప్పటికే తలపెట్టిన ప్రాజెక్టులను కొనసాగిస్తూనే కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరించాలని ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కు, డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు, కొత్త ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వనిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు.

సమావేశంలో మంత్రి శ్రీ దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసిమ్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌ను కలిసిన గల్లా జయదేవ్

అమరరాజా సంస్థ(Amararaja) ఛైర్మన్ గల్లా జయదేవ్‌ బుధవారం సీఎం రేవంత్​ను మర్యాదపూరకంగా సచివాలయంలో కలిశారు. ఆ సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమరరాజా కంపెనీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అధునాతన సాంకేతిక ఉపయోగించే కంపెనీలకు ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. గిగా కారిడార్‌​కు ప్రభుత్వం సహకారం అందించినందుకు అభినందనీయమని అన్నారు. కాగా, రూ. 9500 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది అమరరాజా సంస్థ.