TELANGANA

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక అప్‌డేట్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది.

సెప్టెంబర్‌ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం సాయంత్రం విడుదల చేసింది.

ఈ షెడ్యూల్‌ ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్ 4, 5, 6, 8వ తేదీల్లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 12, 13, 14, 20, 21, 22, 25, 26, 27,29వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అందుబాటులో ఉంచిన హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మిగితా పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

డీఎస్సీ ద్వారా 5089 పోస్టుల భర్తీకి అనుమతి

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 2575 ఎస్జీటీ, 1739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ గత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి టీఎస్ పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లు నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ప్రకారం టెట్ క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొందించి డీఎస్సీకి పంపుతారు. ఆ తర్వాత ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయి.