తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను, తన తండ్రి చెరుకు సుధాకర్‌ను హత్య చేస్తానని బెదిరించారని వెంకటరెడ్డిపై నల్లగొండకు చెందిన చెరుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన నల్లగొండ వన్ టౌన్ సీఐకి ఆదివారం సుహాస్ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి.. ‘మీ నాన్న నా గురించి టీవీ చానెల్‌తో ఎక్కువ మాట్లాడుతున్నాడు. వాడ్ని చంపడానికి 100 వాహనాల్లో నా మనుషులు తిరుగుతున్నారు. నీ నవ్య హాస్పిటల్ కూడా కూల్చేస్తారు. నిన్ను(సుహాస్) సైతం చంపుతానని బెదిరించారు. వారంలో మీ నాన్న సుధాకర్‌ను చంపివేస్తారని వార్నింగ్ ఇచ్చారు’ అని చెరకు సుహాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కాల్ రికార్డింగ్‌లో ఏముందంటే.. ‘స్టేట్‌మెంట్ విన్నావుగా.. వాన్ని చంపుతామని వంద వెహికిల్స్‌లో తిరుగుతున్నారు. ఈ ఒక్కసారి కాదు.. ఇప్పటికే వంద సార్లు నా గురించి మాట్లాడుతున్నాడు. నెల రోజుల నుంచి ఓపిక పట్టి.. ఇప్పుడు వంద వెహికిల్స్‌లో తిరుగుతున్నారు చంపెతందుకు. నీ హస్పిటల్ ఉండదు. నేను లక్షల మందిని బతికించినా. ఎంత ధైర్యం వానికి.. నిన్న మొన్న పార్టీలోకి వచ్చి.. ఇప్పుడు నా మీదనే మాట్లాడుతుండు. ఇక వదిలిపెట్టరు నా మనుషులు వాన్ని. వార్నింగ్ ఇస్తున్నా.. వారం రోజుల్లో వాన్ని చంపేస్తారు. వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తారు’ అని ఉంది.