TELANGANA

కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు ఖరారు…

తెలంగాణ ఎన్నికల (Telangana Elections) బరిలో రోజురోజుకీ దూసుకుపోతున్న కాంగ్రెస్.. అన్నిపార్టీలను కలుపుకొని ముందుకు సాగుతోంది. ఇన్ని రోజులుగా సీట్ల కేటాయింపులపై కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐ లతో రాజీకుదరకపోవడంతో ఇక పొత్తు ఉండదేమోననే అభిప్రాయం అందరిలో కలిగింది. దానికి కారణం కమ్యూనిస్టులు ఒంటరి పోరు చేస్తున్నట్లు ప్రకటించడమే. కానీ అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కృషితో ఇరు పక్షాల మధ్య డీల్ కుదిరింది.

 

కమ్యూనిస్టు పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలరని నమ్మిన కాంగ్రెస్ అధిష్ఠానం.. సీపీఐతో సోమవారం చర్చలు జరిపింది. చర్చల కోసం స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీపీఐ ఆఫీసుకు వెళ్లి.. కూనంనేని సాంబ శివరావు, చాడ వెంకటరెడ్డి లాంటి కీలక కమ్యూనిస్టు నేతలతో పొత్తుపై చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం సంతృప్తి చెందిన కామ్రేడ్లు కాంగ్రెస్‌తో పొత్తుకి అంగీకరించారు.

 

పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం అంగీకారం తెలిపింది. చర్చల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీపీఐతో కాంగ్రెస్ పార్టీ చర్చలు సఫలం అయ్యాయి. అధిష్టానం ఆదేశాలతో చర్చలు జరిపి.. చివరికి ఒప్పందానికి వచ్చాం. తమతో కలిసి నడవడానికి సీపీఐ సిద్ధమైందన్నారు. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీచేస్తుందని.. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సీపీఐ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ మీడియాతో కాంగ్రెస్‌తో పొత్తు గురించి మాట్లాడారు. ‘నెల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం కుదిరింది. కేసీఆర్ చేతి నుంచి తెలంగాణని విముక్తి చేయడం మా లక్ష్యం. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పాలన బాగుంది. రాజకీయాలకు మతాన్ని జోడిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లీస్ మూడు ఒక్కటే. బీజేపీ, బీఆర్ఎస్ మద్య బంధం ఉంది కాబట్టే కవితని అరెస్ట్ చేయడం మానేశారు. బండి సంజయ్‌కు బండి కట్టి ఇంటికి పంపారు. కేసీఆర్ నియంతృత్వ పోకడకి కలిసికట్టుగా వ్యతిరేకంగా పోరాడాలి. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఫామ్ హౌస్ పాలనకి వ్యతిరేకంగా పోరాడాలి’ అని నారాయణ చెప్పుకొచ్చారు.

 

ఆ తరువాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు అనివార్యం అయిందన్నారు.

 

‘కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని చూసి ఇతర పార్టీలు ఆర్టిఫీషియల్‌గా నడుచుకుంటున్నాయి. మునుగోడులో కూడా మేము బీజేపీని ఓడించడానికి పొత్తు పెట్టుకున్నాం. ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో తప్పనిసరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. తమ బాధలు చెప్పుకునే పరిస్తితి తెలంగాణలో లేదు. ప్రశ్నించే గొంతుకులను బీఆర్ఎస్ ప్రభుత్వం నొక్కేసింది. కేంద్రంలో నిరంకుశ పాలన ఉంటే అదే స్థాయిలో బీఆర్ఎస్ ఇక్కడ ఉంది. సీపీఎంతో కూడా ఏదో ఒక అవగాహన వస్తుందని అనుకుంటున్నాం. భవిష్యత్‌లో ఈ స్నేహం ఇలానే కొనసాగాలని అనుకుంటున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’ అని ఆయన చెప్పారు.