టీఎస్‌పీఎస్సీ పేపర్స్ లీకేజీ కథ మరో మలుపు తిరిగింది. క్లైమాక్స్‌లో ప్రీ క్లైమాక్స్‌లాగా సడన్ ఎంట్రీ ఇచ్చింది ఈడీ. టీఎస్‌పీఎస్సీపేపర్స్ లీకేజీ వెనక ఆర్ధిక లావాదేవీలపై గురిపెట్టింది. కేసు ఫైల్‌చేసి 15మంది నిందితుల బ్యాంక్ అకౌంట్లపై ఫోకస్ పెట్టింది. సిట్ నుంచి వివరాలు తీసుకుని, ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు అధికారులు. ఈడీ ఎంట్రీతో టీఎస్‌పీఎస్సీపేపర్స్ లీకేజీ ఎపిసోడ్ మరో మలుపు తిరిగినట్టయ్యింది. ఇప్పటివరకూ అసలు కుట్రధారులెవరు? లీకేజీ వెనక ఎవరున్నారనే కోణంలోనే సిట్ దర్యాప్తు సాగుతుంటే, ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో ఆర్ధిక కోణం కూడా బయటికి రాబోతోంది. అసలు, పేపర్లు ఎంతమందికి చేరాయి? ఎవరెవరికి ఎంతెంత పైకం ముట్టింది? మొత్తం టోటల్ లావాదేవీల వాల్యూ ఎంత? ఇలా గుట్టంతా క్యాప్చర్ చేయనుంది ఈడీ. మరోవైపు సిట్ దర్యాప్తు దాదాపు క్లైమాక్స్‌కి వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉద్యోగుల్ని ప్రశ్నించిన సిట్, శనివారం కీలక విచారణ చేపట్టింది. ఐఏఎస్ ఆఫీసర్, టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితారామచంద్రన్‌ను రెండు గంటలపాటు ప్రశ్నించి, ఆరు పేజీల స్టేట్‌మెంట్ రికార్డుచేసింది.
వెలుగులోకి సంచలన విషయాలు..
ప్రధాన నిందితుడు ప్రవీణ్.. అనితా రామచంద్రన్‌కు పీఏగా ఉండటంతో ఈ ఇంటరాగేషన్ తీవ్ర ఉత్కంఠ రేపింది. అలాగే టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డిని గంటన్నరపాటు విచారించారు అధికారులు. లింగారెడ్డికి పీఏగా ఉన్న రమేష్ వివరాలపై ఆరా తీశారు. ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్స్ కమిషన్ ఛైర్మన్ ఆధీనంలోనే ఉంటాయని, ఆయన కంప్యూటర్‌లోనే నిక్షిప్తం అవుతాయని, బోర్డు సభ్యుల ప్రమేయం ఉండదని అనితా రామచంద్రన్ చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు A10 షమీమ్, A11 సురేష్, A12 రమేష్‌ను కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి సుదీర్ఘంగా విచారించారు. ఈ ముగ్గురి ఇళ్లలో ఇప్పటికే సోదాలుచేసి గ్రూప్1 మెటీరియల్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురికీ గ్రూప్-1 పేపర్ ప్రవీణ్ నుంచే వచ్చినట్లు నిర్ధారించుకున్నారు సిట్ అధికారులు.
ఔట్‌సోర్సింగ్ నియామకాలపైనా..
ఇక టీఎస్‌పీఎస్సీ లో ఔట్‌సోర్సింగ్ నియామకాలపైనా దృష్టి పెట్టింది సిట్. అలాగే, నిందితుల మొబైల్ ఫోన్లకు సంబంధించి పుణె FSL నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది. మొత్తానికి టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసు తుదిదశకు చేరినట్టేనన్న మాట వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో దర్యాప్తు కంప్లీట్‌చేసి, ఈనెల 11న కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చెయ్యబోతోంది సిట్.