TELANGANA

గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు..

గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు ఏర్పాటైన కమిటీ సభ్యులు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్, హైలెవల్ కమిటీ సభ్యులతో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…

 

ఆర్థికపరమైన అంశాలను కౌన్సిల్ లో తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదం కు పంపించడం జరుగుతుందని, మిగతా అంశాలు వెంటనే అమలు చేయుటకు అధికారులను కోరారు. కుక్కల నియంత్రణ చర్యల తో పాటు శానిటేషన్ మెరుగుపరిచేందుకు వచ్చే వారం ఏర్పాటు చేసే సమావేశంలో చర్చించడం జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు. హై లెవెల్ కమిటీ సిఫార్సు చేసిన 26 అంశాలలో 25 అంశాలు తక్షణం అమలు చేయడం జరుగుతుందని, అందులో లేటెస్ట్ టెక్నాలజీ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు ద్వారా చేపట్టాలని సభ్యులు సిఫార్సు చేసిన అంశం మినహా అన్ని అంశాలు యుద్ద ప్రాతిపదికన అమలుకు చర్యలు తీసుకుంటామని మేయర్ అన్నారు.

 

అంతకు ముందు శానిటేషన్ పై జరిగిన సమావేశంలో శానిటేషన్ మెరుగుపరిచేందుకు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు చెత్త తొలగించడం, దాంతో పాటుగా హోటల్, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్ల ఆహార వ్యర్థాలను వెంటనే తరలించేందుకు ఒక్కొక్క హోటల్ కు, ఫంక్షన్ హాల్ కు ఒక వాహనం కేటాయించాలని అదేవిధంగా హోటల్లు, ఫంక్షన్ హాల్స్ వివరాలను సేకరించి నివేదిక అందజేయాలని శానిటేషన్ ఇన్చార్జి అడిషనల్ కమిషనర్ ను ఆదేశించారు. రాంకీ ద్వారా సెకండరీ చెత్త సేకరణ మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఒప్పందం ప్రకారం రాంకీ సంస్థ చేయాలని లేని పక్షంలో విధించిన జరిమానా వివరాలను తెలియజేయాలని కార్పొరేటర్లు అడిగారు.