APNationalTELANGANA

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కేంద్రం విడుద చేస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

దీంతో.. నోయిడా అధికారులు కొత్త మార్గదర్శకాలు తెరపైకి తెచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఉద్యోగులు ఆఫీస్ లకు రావొద్దని హెచ్చరించారు. అలాంటి వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు.

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 1,527 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారంతో పోల్చితే ఇవి 33 శాతం అధికం. పాజిటివీ రేటు 27.7 శాతంగా ఉంది. దీంతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ నోయిడా ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. వైరస్ బారినపడకుండా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మాస్క్ నిబంధన పాటించకపోతే జరిమానా విధిస్తామని చెప్పింది.

ఆఫీసులు, పని ప్రదేశాల్లో యాజమాన్యాలు కరోనా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు అధికారులు. కార్యాలయాలను శానిటైజ్ చేయాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ప్రధాన ద్వారాల వద్ద థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యోగులకు జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కన్పిస్తే వాళ్లకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలని చెప్పారు. లక్షణాలు తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా నిర్థారణ అయితే, నెగెటివ్ వచ్చిన తర్వాతే వారు ఆఫీస్ లకు రావాలని చెప్పారు.

మరోసారి దేశవ్యాప్తంగా అన్నిచోట్ల కరోనా నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఈ సారి కేంద్రం ప్రకటన చేయకముందే, ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి.