మయన్మార్‌లో సైన్యం అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిరాయుధ ప్రజలను కాల్చి చంపడం , వారి పై బాంబుదాడులకు పాల్పడటం, వైమానిక దాడులు చేయడం జరుగుతూనే ఉంది.
నిన్న ప్రజలపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 100 మందికి పైగా ప్రజలు మరణించారు.
కాన్బాలు టౌన్‌షిప్‌లోని పజిగీ గ్రామం వెలుపల, దేశంలో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఐక్య సంఘటన స్థానిక కార్యాలయం ప్రారంభోత్సవం కోసం ఉదయం 8 గంటలకు గుమిగూడిన ప్రజల పైకి సైనిక ఫైటర్ జెట్ నేరుగా బాంబులను పడవేసినట్లు ప్రత్యక్ష సాక్షి అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు. ఈ ప్రాంతం దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలేకి ఉత్తరాన 110 కిలోమీటర్ల (70 మైళ్ళు) దూరంలో ఉంది.
చనిపోయిన వారిని గాయాలపాలయిన వారిని స్థానికులు తీసుకొని వెళ్తుండగా సైన్యం మళ్ళీ ఓ హెలికాప్టర్ ద్వారా దాడికి తెగపడింది. హెలికాప్టర్ మీది నుంచి సైనికులు ప్రజలపైకి కాల్పులు జరిపారు.
“నేను గుంపు నుండి కొంచెం దూరంలో నిలబడి ఉండగా, ఒక ఫైటర్ జెట్ నేరుగా గుంపుపై బాంబులు వేసింది, నేను సమీపంలోని గుంతలోకి దూకి దాక్కున్నాను. కొన్ని క్షణాల తర్వాత, నేను లేచి చుట్టూ చూసినప్పుడు, పొగలో ముక్కలు ముక్కలైన శరీర భాగాలు కనిపించాయి. అగ్ని ప్రమాదంలో కార్యాలయ భవనం దగ్ధమైంది. దాదాపు 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తరలిస్తుండగా హెలికాప్టర్ వచ్చి మరింత మందిని కాల్చిచంపింది.” అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.