మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్, దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.. అయితే ఇందులో ఎవరు అధికారం సాధిస్తారు?. ఎవరు ముఖ్యమంత్రి, ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారు అనే ప్రశ్నలకు కీలకమైన సమాధానం వచ్చింది. టైమ్స్ నౌ నవభారత్, ఈ టీజీ రీసెర్చ్ సర్వే చేయగా.. పలు ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బిజెపి.. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధిస్తుందని ఆ సంస్థ తెలిపింది.. ఓట్ల శాతం పరంగా చూస్తే బిజెపికి 38.2%, కాంగ్రెస్ పార్టీకి 28.7%, ఇతరులకు 33.1% ఓట్లు వస్తాయని ఆ సంస్థల సర్వేలో తెలింది. ఈ సర్వేలో ఆ సంస్థలో ప్రధానంగా అడిగిన ప్రశ్న కాబోయే ప్రధానమంత్రి ఎవరు అని?
అయితే ఈ జాబితాలో సర్వేలో పాల్గొన్న ఓటర్లు మరో మాటకు తావు లేకుండా మోదీకి జై కొట్టారు. ప్రధానికి అనుకూలంగా 64 శాతం మంది ఓటు వేశారు. రాహుల్ గాంధీకి 13 శాతం మంది సమ్మతం తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ కు 12%, నితీష్ కుమార్ 6%, కేసీఆర్ కు 5% ఓట్లు వచ్చాయి. ఇక ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ కూర్చోవాలని 29%, అరవింద్ కేజ్రివాల్ 19%, మమతా బెనర్జీ 13%, నితీష్ కుమార్ 8%, కేసీఆర్ 7%, దాచిన రుస్తమ్ తో 24% మంది తమ నిర్ణయం తెలిపారు. ఇక ఈ సర్వేలో 2024 లో బిజెపి 300 సీట్లకు పైగా గెలుస్తుందా అని ప్రశ్నించినప్పుడు.. దానికి 42 శాతం మంది అవును అను సమాధానం చెప్పారు. అదే సమయంలో 26 శాతం మంది 300 సీట్లు కష్టమని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల నాటికి తేలిపోతుందని 19 శాతం మంది తేల్చి చెప్పారు. 13 శాతం మంది ఏమీ చెప్పలేకపోయారు.